DailyDose

మైక్రోసాఫ్ట్ చాలా బలంగా ఉంది-వాణిజ్యం

Microsoft CEO Satya Nadella Speaks Of Company's Financial Strength

* కరోనా పోరులో తనవంతు సహకారం అందిస్తామని ప్రకటించిన మహీంద్రా గ్రూప్‌.. అందులో భాగంగా తొలి అడుగు వేసింది. రూ.7,500కే అధునాతన వెంటిలేటర్‌ అందించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపింది. అంబు బ్యాగ్‌గా పిలిచే ఆటోమేటెడ్‌ వెర్షన్‌ వాల్వ్‌ మాస్క్‌ వెంటిలేటర్‌ నమూనాను రూపొందించామని, మూడు రోజుల్లో అనుమతులు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ‘‘కొవిడ్‌పై పోరులో భాగంగా దేశీయ ఐసీయూ వెంటిలేటర్ల తయారీ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం. అధునాతన మెషిన్ల ఖరీదు సుమారు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. మా బృందం రూపొందించిన ఈ వెంటిలేటర్‌ సుమారు రూ.7,500 మాత్రమే అవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. దీన్ని రూపొందించిన బృంద సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

* కరోనా దెబ్బకు పాతాళానికి పతమైన దేశీయ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనించాయి. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం మదుపరుల్లో ఉత్సాహం నింపింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌1,410 పాయింట్లు లాభపడి 29,946 వద్దకు చేరగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8,641 వద్ద స్థిరపడింది. రూపాయితో డాలర్‌ మారకం విలువ 75.25 వద్ద కొనసాగుతోంది.

* కరోనా వైరస్‌ ప్రభావంతో విమానయాన రంగ ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడటంతో తమ ఉద్యోగులకు మార్చి నెల వేతనంలో కోత ఉంటుందని గోఎయిర్‌ సీఈఓ వినయ్‌ దుబే వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిలో ఇంతకుమించి చేయడానికి తమకు మరో మార్గం లేదని ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు. అయితే తక్కువ వేతనం తీసుకునే వారిపై పరిమిత ప్రభావం పడేలా చూస్తామనే భరోసాను ఆయన ఇచ్చారు.

* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో ఔషధాలు, వైద్య ఉపకరణాల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భారత వైద్య పరికరాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ నుంచి వీటికి మినహాయింపు ఉన్నప్పటికీ.. ఆసుపత్రులు, వినియోగదార్లకు సరైన సమయంలోగా చేరలేకపోతున్నాయని తెలిపాయి. ప్రస్తుత కష్ట సమయంలో ఔషధాలు, వాటి ముడిసరుకులు, మాస్క్‌లు, శానిటైజర్‌లు, గ్లోవ్స్‌, డిస్పోజబుల్స్‌ లాంటి వాటిని అత్యంత అవసరమైన ఆరోగ్య సంరక్షణ సరఫరా ఉత్పత్తులుగా గుర్తించాలని స్థానిక ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు భారత వైద్య పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఓ లేఖ కూడా రాసింది.

* దుస్తుల ఎగుమతులపై పన్ను రాయితీ పథకాన్ని (రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ అండ్‌ లెవీస్‌-ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌) మార్చి 31 తర్వాత కూడా పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌ఓడీటీఈపీ) పథకంలోకి ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ను విలీనం చేసేంత వరకు ఈ పన్ను రాయితీ పథకం కొనసాగుతుందని ప్రకటన విడుదల చేసింది. దీంతో టెక్స్‌టైల్‌ రంగంలో పోటీ పెరగడానికి అవకాశం ఉందని భావిస్తోంది. ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ పథకం ద్వారా ఎగుమతులపై విధించిన అన్ని పన్నులపై రాయితీ లభిస్తుంది. ఈ పథకం కింద దుస్తులకు 6.05 శాతం, మంచాల నార, కర్టెన్లు, దిండ్లు, తివాచీలు వంటి గృహ వస్త్ర ఉత్పత్తులపై 8.2 శాతం గరిష్ఠంగా రాయితీ ఉంది. గత ఏడాది సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్‌ఓడీటీఈపీ పథకానికి ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి పాత పథకాన్నే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

* మైక్రోసాఫ్ట్‌ మూలాలు పటిష్ఠమని, కరోనా వైరస్‌ ప్రభావం నుంచి వెంటనే బయటపడతామనే నమ్మకం తమకు ఉందని మైక్రోసాప్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అయితే అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన విపణుల్లో గిరాకీపై ఏ మేర ప్రభావం పడిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఇంటి నుంచే క్లయింట్ల అవసరాలను తీరుస్తున్న విధానంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సరఫరా విషయంలోనే అవరోధాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరిలోగా ఎక్స్‌బాక్స్‌ గేమింగ్‌ కన్సోల్‌ సహా పలు సర్ఫేస్‌ డివైజెస్‌ను విడుదల చేయనున్నట్లు కొవిడ్‌ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్‌ హామీ ఇచ్చింది. అయితే వీటిని అందుబాటులోకి తెస్తామా లేదా అనే దాని కంటే.. నాణ్యత, గిరాకీ పరిస్థితులు, ముఖ్యంగా ప్రజల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

* కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) శరవేగంగా విస్తరిస్తున్న అమెరికాలో నకిలీ టెస్ట్‌ కిట్లు, మందుల బెడద ఎక్కువైంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, భయభ్రాంతులను సొమ్ము చేసుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మా కంపెనీ టెస్ట్‌ కిట్‌తో మీరు ఇంట్లోనే సొంతంగా పరీక్ష చేసుకొని కరోనా వ్యాధి వచ్చిందీ లేనిదీ నిర్ధారించుకోవచ్చు… అని ప్రచారం చేసుకుంటూ టెస్ట్‌ కిట్లు విక్రయించే సంస్థలు అధికమయ్యాయి. అదేవిధంగా ఈ వ్యాధికి మేం తయారు చేస్తున్న మందులు పరిష్కారాన్ని చూపుతాయి- అని చెప్పుకునే కంపెనీలు కూడా తయారయ్యాయి. ప్రజలు కూడా ఈ టెస్ట్‌ కిట్లు, మందులను కొనుగోలు చేయటానికి మొగ్గుచూపుతున్నారు. ఆన్‌లైన్లో, ఫార్మసీల్లో కరోనా కిట్లు, మందులు ‘ఆర్డర్‌’ చేయటానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో నకిలీల ముప్పును అరికట్టటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) రంగంలోకి దిగింది. మార్కెట్లో చెలామణి అవుతున్న అన్నిరకాల టెస్ట్‌ కిట్లను నమ్మవద్దని, అందులో అన్నీ నకిలీవని, ఈ కిట్లను తాము ఆమోదించలేదని తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. అంతేగాక కరోనా వైరస్‌ వ్యాధిని అదుపు చేసే కచ్చితమైన ఔషధం ఇంకా రాలేదని, కాబట్టి నకిలీ టెస్ట్‌ కిట్లు, వ్యాధిని తగ్గిస్తాయని ప్రచారంలో ఉన్న ఔషధాల జోలికి పోవద్దని ప్రజలకు తాజాగా సూచిస్తోంది.

* రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను కొనుగోలు చేయాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 31, 2020 కల్లా జియోను రుణరహిత సంస్థగా నిలపాలన్నది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. 60 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.4,20,000 కోట్లు) విలువైన జియోలో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఫేస్‌బుక్‌ యోచిస్తోంది. అయితే ఈ కథనంపై అటు రిలయన్స్‌ జియో కానీ.. ఫేస్‌బుక్‌ కానీ స్పందించలేదు. ఒప్పందం ఎపుడు జరుగుతుందన్నదానిపై లాక్‌డౌన్‌ ప్రభావం పడవచ్చని ఆ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

* కొవిడ్‌-19 మహమ్మారి కబళించకుండా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో స్టాక్‌ మార్కెట్‌ అనుబంధంగా పనిచేసే సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్రోకరేజీ సంస్థల కార్యాలయాలకు వచ్చే సిబ్బంది రాకపోకలను పలు రాష్ట్రాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వారు విధుల నిర్వహణకు సమయానికి హాజరుకాలేకపోతున్నారు. మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ ప్రకటించకముందు నుంచే తమ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (అన్‌మి), కమోడిటీ మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీపీఏఐ)లు సెబీకి లేఖలు రాశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రోకింగ్‌ కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా చాలామంది కోరుతున్నారని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను అత్యవసర విభాగంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని లేదా.. మార్చి 31 వరకూ స్టాక్‌ ఎక్స్ఛేంజీలను నిలిపివేయాల్సిందిగా కోరుతూ మార్చి 23న సీపీఏఐ సెబీకి లేఖ రాసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే… రెండు రోజుల వ్యవధి ఇచ్చి, ఎక్స్ఛేంజీలను తాత్కాలికంగా నిలిపివేయాలని అన్‌మి కూడా కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. తమ సిబ్బంది కార్యాలయాలకు వచ్చివెళ్లేటప్పుడు కష్టమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర సర్వీసుల కింద దీన్ని గుర్తించకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు ఒక స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ప్రతినిథి తెలిపారు.