DailyDose

ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు-తాజావార్తలు

Telugu Breaking News-India Extends International Flights Ban

* దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగించింది. ఏప్రిల్‌ 14 వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి ఉన్న విమానాలు, సరకు రవాణా విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ విమనాలపై నిషేధానికి సంబంధించి ఈ నెల 19న ఇచ్చిన ఉత్తర్వులకు కొనసాగింపుగా మరోసారి ఉత్తర్వులు వెలువరించింది.

* కరోనా వైరస్‌ రూపంలో ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటోందని.. మానవ జాతినే ఆందోళనకర పరిస్థితుల్లోకి నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని.. 21రోజులు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాట్లాడారు. చైనాలో మొదలైన ఈ వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోందన్నారు. సామాజిక దూరంతో పాటు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ఉత్తమ్‌ సూచించారు. కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో ప్రజలకు సహాయంగా నిలబడాలన్నారు.

* తెలంగాణ-ఆంధ్రా ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక వేలాదిమందిని రోడ్డున పడేశారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తెలంగాణలో వేలాదిమందికి ఎన్‌ఓసీలు ఇచ్చి హాస్టళ్లు ఖాళీ చేసిన అనంతరం అవి రద్దుచేయడం సరికాదన్నారు. ఆంధ్ర పోలీసులు అనుమతించకపోవడంతో జగ్గయ్యపేటకు సమీపంలో దాదాపు 3 వేల మంది పడిగాపులు కాస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

* ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ చేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు కొన్నిరోజులపాటు ఇళ్లకే పరిమితమైతే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 21రోజుల లాక్‌డౌన్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇంతకుముందే ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇదే సరైన సమయమని, ప్రజలు దీనికి సహకరించాలని కోరుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి కావాల్సిన నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.

* రాజధానిగా అమరావతే కొనసాగాలని రైతుల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం వందో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. వంద రోజులుగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపులు, అవమానాల నడుమ అమరావతి రైతుల ఆందోళన కొనసాగిందని గుర్తు చేశారు.

* కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ సంస్థ అధినేత పీవీ కృష్ణారెడ్డి రూ.5 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అలాగే, శాంతా బయోటెక్‌ సంస్థ అధినేత వరప్రసాద్‌ రెడ్డి వ్యక్తిగత సాయంగా రూ. కోటి చెక్కు సీఎంగా అందించగా.. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత నర్సింహారెడ్డి, మీనాక్షి గ్రూప్‌ ఛైర్మన్‌ కె.ఎస్‌.రావు, క్రెడాయ్‌ ప్రతినిధులు రూ.కోటి చొప్పున చెక్కులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. మరోవైపు లారస్‌ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చి లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను ఉచితంగా అందజేయడంతో పాటు సీఎం సహాయ నిధికి ఆ సంస్థ సీఈవో సత్యనారాయణ రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కోసం జీపీకే సంస్థ ప్రతినిధులు ఫణికుమార్‌, శైలజా రెడ్డి 4 వేల ఎన్‌-95 మాస్కులను కేటీఆర్‌కు అందించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

* కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ నిత్యావసరాల కోసం ప్రజలు రహదారులపైకి వస్తూనే ఉన్నారు. కూరగాయలు, నిత్యావసరాల కోసం ఒకరిద్దరు కాకుండా గుంపులుగా మార్కెట్ల వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. తిరుపతి పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌ వద్ద గత కొద్ది రోజులుగా నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడాన్ని నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. అదే సమయంలో మార్కెట్‌కు వచ్చిన ప్రజలు ఎలాంటి సామాజిక దూరం పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో ప్రధాన రహదారి సహా ఆ మార్కెట్‌ పరిసరాల్లో ఒక మీటర్‌ దూరం చొప్పున అధికారులు మార్కింగ్‌ వేయించారు. వినియోగదారులు ఆ మార్కింగ్‌లోనే నిలబడి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి కూరగాయలను కొనుగోలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా రద్దీ పెరుగుతుండడంతో దాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా మరో 9 ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్లను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ మార్కెట్ల పరిసరాల్లో కూడా మీటర్‌ దూరంతో మార్కింగ్‌లు ఏర్పాటు చేసి సామాజిక దూరాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఈ మార్కెట్లు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

* కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకు ఒకసారి వస్తాయో రావో తెలియదని.. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కోలేకపోతే చాలా కష్టంగా ఉంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇలాంటి వ్యాధులను మనం చూస్తామని కూడా అనుకోలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. కరోనాలాంటి వ్యాధిపై క్రమశిక్షణతోనే గెలవగలమని.. లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. కొన్ని నిర్ణయాలు చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం రాత్రి జరిగిన కొన్ని ఘటనలు తన మనసును కలచివేశాయని చెప్పారు. తెలంగాణ సరిహద్దు నుంచి మన వాళ్లు ఏపీలోకి రావడానికి ప్రయత్నించారని.. అయితే ప్రస్తుతం చిరునవ్వుతో వారిని ఆహ్వానించే పరిస్థితి లేదన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడికే పరిమితం కాకపోతే ఈ వ్యాధిని కట్టడి చేయలేమని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ప్రదేశం మారితే వచ్చే ఇబ్బందేంటో ఆలోచించాలన్నారు.

* గుంటూరు జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో ఐడీ ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు వ్యక్తులు జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని బుధవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్‌-19 ప్రత్యేక విభాగానికి తరలించారు. ఇకపై కరోనా పాజిటివ్‌ కేసులకు విజయవాడలోనే చికిత్స అందిస్తారని వైద్యులు తెలిపారు.

* సనత్‌నగర్‌ నయోజకవర్గ పరిధిలోని పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో పరిస్థితిని పరిశీంచిన తర్వాత యూసఫ్ గూడ లోని ఓ సూపర్ మార్కెట్ ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు ఇక్కడకు 15 రూపాలయలు తేడా ఉండటంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

* కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గురువారం ఆమె దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు.

* కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం కలుగుతుంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనావైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది.

* ఏపీ మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో కేబినెట్‌ భేటీ జరగనుంది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో సీఎం జగన్‌ సహా మంత్రులు సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మూడు నెలల బడ్జెట్‌కు సంబంధించి జూన్‌ 30 వరకు అవసరమైన నిధుల కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

* తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. తొలిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షిస్తే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

* గుంటూరు జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానిత లక్షణాలతో ఐడీ ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు వ్యక్తులు జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని బుధవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్‌-19 ప్రత్యేక విభాగానికి తరలించారు.

* గురువారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన తన అధికారిక ఖాతా వేదికగా.. కరోనా కల్లోలం కోసం పాటుపడుతోన్న కేంద్ర, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నానని తెలియచేస్తూ తొలి ట్వీట్‌ను చేశారు. ‘పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌తో స్ఫూర్తి పొందిన నేను.. కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలకు నా వంతు సాయంగా రూ.70 లక్షలను ఆయా సహాయనిధిలకు అందిస్తున్నాను’’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.

* కరోనా దెబ్బకు పాతాళానికి పతమైన దేశీయ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. వరుసగా మూడో రోజూ లాభాల బాటలో పయనించాయి. కరోనా నేపథ్యంలో గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌1,410 పాయింట్లు లాభపడి 29,946 వద్దకు చేరగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 323 పాయింట్ల లాభంతో 8,641 వద్ద స్థిరపడింది. రూపాయితో డాలర్‌ మారకం విలువ 75.25 వద్ద కొనసాగుతోంది.

* ప్రపంచంలోని కరోనా కేసుల్లో అధిక శాతం తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ లేదా ఆర్ద్రత తక్కువగా గల దేశాల్లోనే నమోదైనట్టు ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 90 శాతం కరోనా కేసులు 3 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 4-9 గ్/ం3 కంటే తక్కువగా ఉన్న దేశాల్లోనే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలియచేసింది. గత అభిప్రాయాలకు భిన్నంగా, ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా ఆర్ద్రత కూడా కొవిడ్‌-19 వ్యాప్తిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంఐటీకి చెందిన శాస్త్రవేత్తలు గణాంకాల విశ్లేషణ ద్వారా నిరూపించారు.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైందని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 36కు చేరిందని వివరించారు.

* దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి అత్యవసర సమయంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో భారత్‌ చేసిన సాయానికి చైనా మరోసారి కృతజ్ఞతలు తెలిపింది.