Movies

పరిచయం అవసరం లేని నటుడు..ప్రకాశ్‌రాజ్-TNI కథనం

Versatile Actor Prakash Raj - Birthday Special Story - TNILIVE

పరిచయం అవసరం లేని నటుడు… ప్రకాష్‌రాజ్‌. ఏ భాషలో నటించినా… ఆ భాష మాట్లాడుతూ ‘మా నటుడే’ అనేంతగా ప్రేక్షకుల సొంతమవుతుంటాడు. కన్నడ మాతృభాష అయినప్పటికీ… తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడటం ప్రకాష్‌రాజ్‌ ప్రత్యేకత. ఏ పాత్ర అప్పజెప్పినా సరే… అందులో ఇట్టే ఒదిగిపోతుంటారు. ‘ఇద్దరు’, ‘అంతఃపురం’, ‘కాంజీవరమ్‌’ చిత్రాలతో జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ‘పుట్టక్కన్న హైవే’ అనే కన్నడ చిత్రానికిగానూ నిర్మాతగా కూడా జాతీయ పురస్కారం అందుకొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, టీవీ హోస్ట్‌గా… ఇలా ఎన్నో రూపాల్లో ప్రకాష్‌రాజ్‌ తన ప్రతిభని ప్రదర్శించారు. ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయనలో ఓ మంచి రైతు కూడా ఉన్నారు. ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులో 26 మార్చి, 1965న దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సెంట్‌ జోసెఫ్స్‌ బాయ్స్‌ హైస్కూల్, సెంట్‌ జోసెఫ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో చదువుకొన్నారు. ప్రకాష్‌రాజ్‌ అసలు పేరు ప్రకాష్‌రాయ్‌. చిత్ర రంగంలో ఆయనకి గురురైన ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ సలహాతో ప్రకాష్‌రాజ్‌గా పేరు మార్చుకున్నారు. నాటక రంగం నుంచి వచ్చిన ప్రకాష్‌రాజ్‌ బెంగుళూరులోని కళాక్షేత్రలో పలు నాటకాల్లో అభినయించారు. ఆ తరువాత కన్నడ టెలివిజన్‌ రంగంలోకి, సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1994లో ‘డ్యూయెట్‌’తో తమిళంలో పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ప్రకాష్‌రాజ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత నుంచి ఆయనకి తెలుగు, మలయాళం, హిందీ భాషల నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ‘సంకల్పం’తో పరిచయమైన ఆయన ఆ తరువాత ‘సహనం’, ‘గన్‌షాట్‌’, ‘వినోదం’, ‘పవిత్రబంధం’, ‘సుస్వాగతం’, ‘హిట్లర్‌’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘అంతఃపురం’… ఇలా ఆయన చేసిన ప్రతి పాత్ర పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్‌రాజ్‌ని ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మార్చేసింది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాతగా కూడా పలు చిత్రాల్ని రూపొందించారు. ప్రకాష్‌రాజ్‌లో మంచి పాఠకుడు, రచయిత కూడా ఉన్నారు. దర్శకుడిగా ఆయన నాలుగు చిత్రాలు చేశారు. తెలుగులో ‘ధోని’, ‘మనవూరి రామాయణం’ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రకాష్‌రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకొన్నారు. ఈ ఇద్దరూ 2009లో విడిపోయారు. అనంతరం ప్రకాష్‌రాజ్‌ ప్రముఖ నృత్య దర్శకురాలైన పోనీ వర్మని వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకి వేదాంత్‌ అనే అబ్బాయి ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారు ప్రకాష్‌రాజ్‌. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొని ఆ గ్రామాభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. ఆ ఊరి పక్కనే పొలాలు కొనుగోలు చేసి అక్కడే నివసిస్తుంటారు ప్రకాష్‌రాజ్‌. ‘నేను మోనార్క్‌ని నన్నెవ్వరూ మోసం చేయలేరు’, ‘స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే.. అందులో నేను గొబ్బెమ్మని రా…’, ‘వాడు సామాన్యుడు కాదు’లాంటి సంభాషణల్ని వినగానే గుర్తుకొచ్చేది ప్రకాష్‌రాజే. ఆయన సంభాషణలు చెప్పే విధానం, హావభావాలే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈరోజు ప్రకాష్‌రాజ్‌ పుట్టినరోజు.