NRI-NRT

14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడి రండి

14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడి రండి

పద్నాలుగు రోజుల క్వారంటైన్ రెడీ అయితే ఎక్కడి నుంచైనా ప్రవాసాంధ్రులు తమ సొంత ప్రాంతాలకు రావాలని లేకపోతే ఎక్కడి వారక్కడే లాక్ డౌన్ పీరియడ్ ముగిసే వరకు వుండిపోవాలని పిలుపునిచ్చింది ఏపీ ప్రభుత్వం. అత్యవసర పరిస్థితిని ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాలని ఏపీ కేబినెట్.. దేశ, విదేశాలలో వున్న ప్రవాసాంధ్రులను కోరింది. శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని వెంకట్రామయ్య మీడియాకు వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించామని. బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం లేక పోవడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 లోబడి తీసుకొచ్చిన ఆర్డినెన్సు జారీకి కేబినెట్ ఆమోదం తెలిపందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్‌ను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో చర్చించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 28వేల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని చెప్పారాయన.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని, విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో కరోనా ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని అన్నారు. కరోనా స్పెషల్ ఆసుపత్రులలో 400 వెంటిలేటర్లని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఏపీలో మార్చి 31 వరకు కాకుండా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, ఎన్-95 మాస్కులను అందుబాటులో ఉంచామని, కరోనా వైరస్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు పర్సనల్ కేర్ ఈక్విప్మెంట్ అందుబాటులో ఉంచామన్నారు.
సరుకు రవాణా వాహనాలకు ఏపీలో లాక్ డౌన్ నుంచి మినహాయించామని, పక్క రాష్ట్రాల నుంచి సరుకు రవాణా వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని క్యాబినెట్ లో చర్చ జరిగిందన్నారాయన. అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర 2 కోట్ల రూపాయలు అందుబాటులో వుంచామని వివరించారు. పంట పండించిన రైతులకు, ఆక్వా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సరుకులు, నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు పేర్నినాని. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని, కరోనా వైరస్ నియంత్రణ, సమస్యలు, సలహాల కోసం సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.