Movies

తండ్రికి తగ్గ తనయుడు రామ్‌చరణ్…TNI కథనం

Ram Charan Birthday Special Story-Telugu Movie News

తండ్రి చాటు తనయుడిగానే పరిశ్రమకి పరిచయమైన కథానాయకుడు రామ్‌చరణ్‌ తేజ్‌. మెగా వారసుడిగా భారీ అంచనాల మధ్య ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు. చిరంజీవిలా డ్యాన్స్‌ వేయగలడా? ఆయనలా నటించగలడా? ఆ గ్రేస్‌ ఉందా? అని మొదటి సినిమాతోనే పోల్చి చూడటం మొదలు పెట్టినా… మోయలేనంత అంచనాల భారం తనపై ఉన్నా… తొలి చిత్రం ‘చిరుత’తో ప్రేక్షకుల్ని మెప్పించాడు చరణ్‌. డ్యాన్స్‌లోనూ, నటనలోనూ, ఈజ్‌లోనూ తన ప్రతిభని ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్ర శ్రేణి మాస్‌ కథానాయకుల్లో ఒకరిగా రామ్‌చరణ కొనసాగుతున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘చిరుత’తో పరిచయమైన చరణ్, ఒకొక్క సినిమాతో మరింత పరిణతి సాధిస్తూ ఎదిగాడు. పుష్కర కాలంగా కథానాయకుడిగా ప్రయాణం చేస్తున్న ఆయన ప్రస్తుతం 14వ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చేస్తున్నాడు. ‘మగధీర’ తరువాత రామ్‌చరణ్‌ – రాజమౌళి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మీసం కూడా మెలేశారు. రెండో చిత్రంతోనే రూ: వంద కోట్ల వసూళ్లు సాధించి రికార్డుల పని పట్టిన రామ్‌చరణ్‌… అగ్ర కథానాయకుడు చిరంజీవి, సురేఖ దంపతులకి 1985 మార్చి 27న జన్మించాడు. చిన్నప్పట్నుంచే తండ్రి సినిమాల్ని చూస్తూ డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 2007లో ‘చిరుత’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంలోనే చక్కటి పరిణతిని ప్రదర్శించిన రామ్‌చరణ్‌ ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు. నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఆ తరువాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చేశాడు. ఆ చిత్రంతో రామ్‌చరణ్‌ పేరు ఇతర భాషల్లోనూ ప్రముఖంగా వినిపించింది. ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డుతో పాటు, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ చిత్రంతో బలమైన మాస్‌ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్‌. 2010లో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో ‘ఆరెంజ్‌’ చేశాడు. ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, చరణ్‌ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. 2011లో సంపత్‌ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్‌ని సాధించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. 2013లో వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ‘నాయక్‌’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘ఎవడు’ చిత్రంలో నటించాడు. ఆ తరువాత ‘జంజీర్‌’తో హిందీకి పరిచయమయ్యాడు. తెలుగులోనూ ఆ చిత్రం ‘తుఫాన్‌’ పేరుతో విడుదలైనా… అది ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఈ చిత్రం అమితాబ్‌ బచ్చన్‌ ‘జంజీర్‌’కి రీమేక్‌గా రూపొందింది. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరివాడేలే’, 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్‌ లీ’ చిత్రాలు చేశాడు. ఆ రెండు చిత్రాలు కూడా మిశ్రమ స్పందననే తీసుకొచ్చాయి. 2016లో వచ్చిన ‘ధృవ’తో మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చరణ్, 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం పలు రికార్డుల్ని తిరగరాసింది. ‘వినయ విధేయ రామ’తో పరాజయం ఎదురైనా మరొక ఘన విజయమే లక్ష్యంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం రంగంలోకి దిగారు. రామ్‌చరణ్‌ కేవలం కథానాయకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా విజయాల్ని అందుకున్నాడు. తన తండ్రి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ని స్వయంగా నిర్మించాడు చరణ్‌. కొణిదెల ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన ఆయన చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని కూడా అందులోనే నిర్మించారు. 2012లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్న చరణ్‌ ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీ బిజీగా కొనసాగుతున్నాడు. గుర్రపుస్వారీని అమితంగా ఇష్టపడే చరణ్, ప్రస్తుతం హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌ ఓనరుగా కొనసాగుతున్నారు. ఆయనకి హైదరాబాద్‌ శివార్లలో ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. అందులో రకరకాల జంతువుల్ని పెంచుతుంటారు. ఖాళీ సమయం ఎప్పుడు దొరికినా అక్కడికి కుటుంబంతో పాటు వెళ్లి పెంపుడు జంతువులతో కలిసి సేద తీరుతుంటారు. తన శ్రీమతి ఉపాసన బహుమతిగా ఇచ్చిన బ్రాట్‌ కుక్కపిల్ల అంటే చరణ్‌కి ఎంతో మక్కువ. విదేశాలకి వెళ్లినప్పుడు ఆ కుక్కపిల్లని మిస్‌ కాకూడదనే ఉద్దేశంతో, బ్రాట్‌ ఫొటోలతో ముద్రించిన లగేజీ బ్యాగులని తనతో తీసుకెళుతుంటాడు చరణ్‌. ఈ రోజు రామ్‌చరణ్‌ పుట్టినరోజు.