Fashion

మెడలో పడవ

Ship Design Jewelry For Women-Telugu Fashion News

అందంగా నగలను తీర్చిదిద్దే కళా, ఆ ఆభరణాలకే వన్నె తెచ్చే మెడా… ఉండాలేకానీ నావలూ చూడచక్కని నగలుగా మారిపోతాయి. మన కథల్లో కనిపించే యువరాజూ, యువరాణీ ప్రయాణించే హంసనావలు ఇదిగో ఇలా ముచ్చటైన లాకెట్లుగా మెడలో ఒదిగిపోతాయి. రత్నాలూ, వజ్రాలూ పొదిగి రాజసానికే రాజసం తెచ్చేలా కనిపిస్తున్న షిప్‌ జ్యువెలరీ నేటితరానికి నయాట్రెండ్‌.నౌకలంటే మనకు జనం ప్రయాణించేవే తెలుసు. అలా మనుషులతో పాటు అప్పట్లో వజ్రాలూ, రత్నాలూ రాశులుగా తరలుతుండేవనీ చరిత్రలో చదివాం. కానీ ఆ రత్నాలతోనే నావలను అలంకరిస్తే… ఆ అందమైన నావలను అమ్మాయి మెడలో ఆభరణంగా మారిస్తే… ఎంత బాగుంటుందో కదూ… అన్న ఆలోచన ఏ సృజనకారుడి మదిలో మెదిలిందో కానీ చూడగానే కళ్లను కట్టిపడేసేలా ముచ్చటైన షిప్‌ జ్యువెలరీ ముస్తాబయింది. కథల్లో ఉండే అందాల హంసనావలా కనిపించే ఇవి అమ్మాయిల మనసుకి లంగరేసేస్తున్నాయిప్పుడు. మామూలుగా మనం చూసే పల్చటి లాకెట్లలా కాకుండా త్రీడీ లాకెట్ల తరహాలో ఈ షిప్‌ లాకెట్లు తయారవుతున్నాయి. అంటే మనం ఎటు వైపు నుంచి చూసినా అచ్చంగా ఒక పడవనే నేరుగా చూస్తున్న అనుభూతిని కలిగించేలా వీటిని రూపుదిద్దుతున్నారు. తెరచాపలుండే పడవల్లాగా, అంతస్తుల్లో కనిపించే ఓడల్లాగా, చూడచక్కగా ముస్తాబు చేసిన నావల్లాగా ఇవి తయారవుతున్నాయి. అంతేకాదు, మనుషులు పడవ నడుపుతున్నట్టూ, లోపల కూర్చున్నట్టూ, నౌక అంచున నిలుచుని బయటికి చూస్తున్నట్టూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నట్టూ… ఇలా రకరకాల బొమ్మలూ వీటిలో కనిపిస్తాయి. పచ్చలూ, కెంపులూ, వజ్రాలూ, విలువైన రకరకాల రత్నాలను పొదిగి ఎనామిల్‌ హంగులద్దుకుని వస్తున్న వీటికి కిందివైపు వేలాడే ముత్యాలు అదనపు ఆకర్షణను తీసుకొస్తున్నాయి. అచ్చంగా బంగారంతో చేసినవీ వీటిలో తయారవుతున్నాయి. సల్వార్లూ, జీన్సూ టాపులతో పాటు చీరల మీదకీ ఈ తరహా జ్యువెలరీ చక్కగా నప్పుతుంది. ఇటు సంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్‌లుక్‌ కూడా జతవ్వాలనుకునే వాళ్లకి ఇవి మంచి ఎంపిక. నిజానికి దాదాపు 16 నుంచి 19వ శతాబ్దాల్లోని రాణుల మెడల్లో ఈ తరహా నగలు కనిపించేవట. అప్పట్లో ఓడల ద్వారా జరిగే వ్యాపారాన్నీ, దాని అభివృద్ధినీ సూచించేందుకు వీళ్లు ఇలా నౌకల బొమ్మల్ని హారాల్లో పతకాలుగా ధరించేవారు. అవి చూడగానే ఆకర్షణీయంగా, సాధారణానికి భిన్నంగా కొత్తగా ఉండటంతో డిజైనర్ల దృష్టి వీటిమీద పడింది. అచ్చంగా ఊహాలోకం నుంచి తీసుకొచ్చి పెట్టినట్టు ఉన్న ఈ నౌకల నగలు చూస్తుంటే బాహుబలిలో దేవసేనలాగా ‘హాయైన హంసనావలోనా…’ అని పాడుకోవాలని మీకు మాత్రం అనిపించట్లేదా చెప్పండి..!