DailyDose

లక్ష కోట్లు వెళ్లిపోయాయి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-1.2lakh Crores DisAppear From Stock Market

* కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రముఖ స్టీల్​ వ్యాపార సంస్థ జేఎస్​డబ్ల్యూ పీఎం కేర్స్​ నిధికి రూ. 100కోట్ల విరాళం ప్రకటించింది.

* కరోనావైరస్‌పై పోరుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చురుగ్గా సిద్ధమవుతోంది. ఇప్పటికే అత్యంత చౌకగా వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఈ సంస్థ తాజాగా ఫేస్‌ షీల్డ్‌ల తయారీని ప్రారంభిస్తోంది. రేపటి నుంచి మహీంద్రా ఫేస్‌ షీల్డ్‌ల తయారీ ప్రారంభమవుతుందని సంస్థ ఎండీ పవన్‌ గోయంకా వెల్లడించారు. తొలుత వీటిని రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరింత వేగవంతం చేస్తామని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

* అంటువ్యాధులు ప్రబలినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అత్యవసరాల కోసం ఈపీఎఫ్‌ ఖాతాదారులు నగదు ఉపసంహరించేందుకు కేంద్ర కార్మికశాఖ అవకాశమిచ్చింది. ఇప్పటికీ ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించగా ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ అయింది. ఉద్యోగి ఉద్యోగి మూడు నెలల మూలవేతనం, డీఏ; లేదా కనీస నిల్వ నుంచి 75 శాతం వరకు తీసుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ మొత్తంలో ఏది తక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తుంది. అవసరమైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

* మార్కెట్ల నుంచి మార్చి నెలలో రూ.1.2లక్షల కోట్లను విదేశీ సంస్థాగత మదుపరులు వాపస్‌ తీసుకొన్నారు. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకొంటుందనే భయంతో చాలా మంది తమ సొమ్మును తీసేసుకొన్నారు. డిపాజిటర్స్‌ డేటాను పరిశీలిస్తే నికరంగా రూ.59,377 కోట్లను ఈక్విటీ మార్కెట్ల నుంచి వాపస్‌ తీసుకోగా.. రూ.52,811 కోట్లను రుణ మార్కెట్ల నుంచి వాపస్‌ తీసుకొన్నారు. మార్చి 2వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో కాలంలో ఈ సొమ్మను తీసుకొన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. దీంతో మార్కెట్ల నుంచి వెళ్లిపోయిన మొత్తం రూ.1,12,188 కోట్లకు చేరింది.

* కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌టీపీసీ కూడా ముందుకు వచ్చింది. తన అన్ని ఆస్పుత్రులను ప్రత్యేక కొవిడ్‌-19 యూనిట్లుగా మార్చుతోంది. ఇప్పటికే తన 45 ఆసుపత్రులు/ఆరోగ్య యూనిట్లను ఐసోలేషన్‌ వార్డులుగా ఉపయోగిస్తోంది. ఈ కేసులను సమర్థంగా నిర్వహించడానికి తగిన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా సమకూర్చుకున్నట్లు ఎన్‌టీపీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని సదుపాయాలతో 121 బెడ్లు సిద్దంగా ఉన్నాయని తెలిపింది.

* రుణగ్రహీతలకు ఆర్‌బీఐ శుక్రవారం పెద్ద శుభవార్తనే వినిపించింది. రెపో రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం ద్వారా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని అతితక్కువ స్థాయి 4.4 శాతానికి తీసుకొచ్చింది. ఈ చర్యవల్ల రెపోతో అనుసంధానమైన అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యవధి ఉండే గృహ, వాహన రుణాలపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపనుంది.