Politics

ఏపీలో నిత్యావసర సరుకుల హెల్ప్‌లైన్ 1902

YS Jagan Administration Reduces Grocery Window Between 6-11

కరోనా వ్యాప్తి నివారణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు బయట తిరిగేందుకు ఇచ్చిన సమయాన్ని తగ్గించారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చిన అనుమతి కొనసాగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు కరోనాపై సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ముఖ్యమంత్రి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పల్లెలతో పోల్చితే పట్టణాల్లో కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లుగా సమావేశంలో గుర్తించారు. నిత్యావసరాల కొనుగోలు పేరిట ప్రజలు ఎక్కువ మంది రహదారులపై తిరిగుతున్నారని.. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరింత పటిష్ఠంగా లాక్‌డౌన్‌ చేయించాలని ఆదేశించిన సీఎం.. దీనికోసం బయట తిరిగేందుకు ఇప్పటి వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలని ఆదేశించారు. ప్రస్తుతం అన్ని చోట్లా నిత్యావసర ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో దీన్ని తగ్గించారు. ఇకపై పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాల కోసం అనుమతిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతిస్తారు.

నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకు పంపాలని సీఎం ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని, అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పొందుపరచాలని ఆదేశించారు. రేషన్‌ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు సర్వే పటిష్ఠంగా ఉండాలని, ప్రతి కుటుంబం వివరాలు కూడా ఎప్పటికప్పుడు నమోదు కావాలని ఆదేశించారు. కొవిడ్‌-19 విస్తరిస్తున్న అర్బన్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బంది నియమించాలని సూచించారు. అదే సమయంలో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా 1902 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.