Kids

చిన్నారుల కోసం కొరోనా ప్రత్యేక ఆటలు

చిన్నారుల కోసం కొరోనా ప్రత్యేక ఆటలు-Kids Special Games During COVID19-TNILIVE Kids

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరింటికి వారు పరిమితం కాక తప్పడం లేదు. ఇలాంటి సమయంలో పిల్లలను టీవీ, సెల్‌లకు అలవాటుచేస్తే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగని ఇంట్లో మమ్మల్ని బంధించారనే భావం వారిలో కలగకుండా చూడాలి. అంటే పిల్లలను ఆటపాటలతో సంతోషంగా ఉండేలా చేయాలి. ఇంట్లోనే ఆడే ఆటలను తల్లిదండ్రులు వారికి పరిచయం చేసి, మంచి స్నేహితుల్లా వ్యవహరించండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ చిన్నప్పటి ఆటలను నేర్పుతూ మీరూ చిన్నపిల్లలు అయిపోండి. కరోనా జాగ్రత్తలు పాటించటం మర్చిపోకండే ..!
*దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు. అమ్మావాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడం లేదు. సమయాన్ని ఎలా గడపాలో అర్థంకాక తికమక పడుతున్నారా? పిల్లలూ.. మీకోసమే కొన్ని ఇంట్లో కూర్చుని ఆడే ఆటలను ఇస్తున్నాం. ఎంచక్కా! అవి ఎలా ఆడాలో నేర్చేసుకుని, లాక్‌డౌన్‌ రోజులన్నీ సరదా సరదాగా గడిపేయండి!
**పులి-మేక ఆట
ఈ ఆటకు ఇద్దరు ఆటగాళ్లు కావాలి. మూడు పులులు, 15 మేకలు ఉండాలి. పైనున్నది కొండ, కింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే ఉండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి. దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీద నుంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని ఉంచాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీద నుంచి దింపవచ్చు. కొండమీదకు పంపించొచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్‌ల మీద పేర్చాలి. పులి తన తర్వాతి క్రాస్‌ వద్ద ఉన్న మేకమీద నుంచి పైనుంచి కిందికిగాని, అడ్డంగాగాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చనిపోయినట్లు భావించి ఆటలో నుంచి తీసేయాలి. అయితే ఒక గడి ఎడంగా ఉన్నా, లేదంటే వరుసగా ఉన్నా రెండు మూడు మేకల మీదుగా పులి దూకకూడదు. అలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యవచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులులపార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులుల మీద నుంచి దూకలేవు. ఆడటం అలవాటైతే ఈ ఆటను చదరంగంలాగానే ఆడుకోవచ్చు.
**చైనీస్‌ చక్కర్‌
ఈ ఆటను స్టార్‌ ఆకారంలో ఉండే బోర్డుపై ఆడతారు. చిన్నచిన్న కాయిన్స్‌ పెట్టుకోవడానికి వీలుగా గుంతలు ఉంటాయి. స్టార్‌ల చివర త్రికోణం ఆకారంలో ఉండే ఆరుమూలలు ఉంటాయి. ఎదురెదురు గడుల వ్యక్తులు ప్రత్యర్థులు అవుతారు. ఈ ఆటను ఇద్దరు నుంచి ఆరుగురు ఆడవచ్చు. ఈ ఆటలో కొన్ని షరతులు ఉన్నాయి. అవి.
* కాయిన్‌ దానిముందు కాయిన్‌ మీద నుంచి జంప్‌ చేసి ముందుకు వెళుతుంది. ఇలా ఎన్ని కాయిన్స్‌ ముందుంటే అన్నింటి మీద జంప్‌ చేసుకుంటూ వెళ్లవచ్చు. కాయిన్‌ పక్కన కాయిన్‌ ఉండి దాని తర్వాత ఖాళీ వచ్చి, మరో కాయిన్‌ ఉంటే ముందు కాయిన్‌ రెండింటి మీదా జంప్‌ చేయవచ్చు. జంప్‌ అవకాశం లేకపోతే ఒకే ఒక గడి కదలాలి. ప్రతి కాయిన్‌కు ఆరువైపులా గీత ఉంటుంది. మనం ఎటువైపైనా వెళ్లవచ్చు. మన ప్రత్యర్థి కాయిన్‌ మన పక్కన ఉన్నా జంప్‌ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఎవరైతే ముందుగా ఎదుటివ్యక్తి ఇంటిలోకి వెళతారో వారే గెలిచినట్టు. వెళ్లలేని వారు ఓడినట్టు.
**గోలీల ఆట
గోలీల ఆట అనగానే ఇంటి బయట ఆడే ఆట అనుకుంటే పొరబాటే. మనం చెప్పుకోబోయే గోలీల ఆట ఇంట్లో కూర్చుని ఒక్కరే ఆడవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది మన మేధస్సుకు పెట్టే పరీక్షలాంటిది. దీనిని గుండ్రంగా ఉండే ప్లాస్టిక్‌ బోర్డు మీద ఆడతారు. బోర్డు మీద గోలీ పట్టేంత సైజులో 33 గుంతలు ఉంటాయి. కానీ మనం 32 గోలీలనే ఆటకు వాడాలి. మధ్య గుంతలో గోలీ పెట్టకుండా వదిలెయ్యాలి. ముందుగా ఒక గోలీని తీసి, ఇంకొక గోలీ మీద నుంచి మధ్య గుంతలోకి వెయ్యాలి. అప్పుడు ఏ గోలీ మీద నుంచి తీశామో ఆ గోలీని ఆటలో నుంచి బయటకు తీయాలి. అలా ఒక గోలీ మీద నుంచి ఇంకొక గోలీని తీస్తూ.. ఒక్క గోలీ మిగిలేవరకూ తీసుకురాగలిగితే మనం గెలిచినట్టే!
**కచ్చకాయల ఆట
ఇది ఆడపిల్లలు ఆడే ఆట. నునుపుగా ఉండే ఐదు, తొమ్మిది చిన్నరాళ్లను తీసుకుని వాటితో ఈ ఆట ఆడతారు. చిన్నరాళ్లను తీసుకొచ్చి, వాటిని ఒక్కొక్క దానిని పట్టుకొని పైకి వేస్తుంటారు. దశలవారీగా పైకి ఎగరవేసే రాళ్లను విభిన్నరీతుల్లో పట్టుకోవాల్సి ఉంటుంది. ఆడాల్సి ఉంటుంది. ఈ ఆటకు వాడే రాళ్లనే కచ్చనకాయలు, అచ్చెనగండ్లు.. అచ్చంగాయలు.. అని రకరకాలుగా అంటుంటారు.
**పచ్చీసు ఆట
ఈ ఆటను నేలపై గీచిగాని, ప్రత్యేకంగా దారంతో అల్లిగానీ గడుల రూపంలో తయారుచేస్తారు. ఇందులో ఐదు గవ్వలు, నాలుగురకాల కాయలు ఉంటాయి. దీన్ని నలుగురు ఆడొచ్చు. ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కాయలు ఉంటాయి. గవ్వలను ఊపి, నేలపై వేస్తారు. అలా వేసినపుడు అవి పడే విధానాన్ని బట్టి పచ్చీసు, బీస్‌, ఎక్కీస్‌.. ఇలా అంకెలు నిర్ణయించి, గడుల్లో కాయలను జరుపుతుంటారు. గడుల మధ్యలో ఇల్లు ఉంటుంది. ముందుగా ఎవరి కాయలన్నీ ఇంట్లోకి చేర్చితే వాళ్ళే ఆట గెలిచినట్టు.
**వైకుంఠపాళి
వైకుంఠపాళి భలే గమ్మత్తయిన ఆట. ఈ ఆట ఆడటం కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చుని చక్కగా స్నేహితులతో ఆడుకోవచ్చు. ఎందరైనా ఈ ఆటను ఆడవచ్చు. అయితే ఆడేవాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పావుల్ని ముందే నిర్ణయించుకోవాలి. సాధారణంగా ఈ ఆట పటంలో (చదరంలో) పది అడ్డు వరుసలు, పది నిలువు వరుసలు ఉంటాయి. కొన్ని పటాలలో ఎనిమిది అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉంటాయి. మరికొన్ని పటాలలో 12 అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉంటాయి. అయితే పాములు, నిచ్చెనలు మాత్రం పటాన్ని బట్టి ఉంటాయి. వైకుంఠపాళి పటంలో 132 గళ్లు ఉంటాయి. ఈ గళ్లలో రకరకాల బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఆట ప్రారంభించే ముందు ఆడేవాళ్లు పందెం వేసే పావులను పటం బయట ఉంచుతారు. నాలుగు గవ్వలు లేదా చింత బద్దలు పందెం వేస్తూ ఆడతారు. వైకుంఠపాళి పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలుగల గళ్లల్లో నిచ్చెనలు ఉంటాయి. మనం పందెం వేసినపుడు పావులు ఆయా గళ్లలోనికి వచ్చినప్పుడు.. అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 16వ గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు పావు వచ్చి నప్పుడు ఆ నిచ్చెన సాయంతో 28వ గడిని చేరుకుంటుంది. అలా చేరుకోవడాన్ని ‘నిచ్చెన ఎక్కడం’ అంటారు. అలా నిచ్చెన ఎక్కిన వారికి మరోసారి ఆడే ఛాన్సు ఉంటుంది. ఒకవేళ మళ్లీ నిచ్చెన ఎక్కినట్లయితే మళ్లీ మరో ఛాన్స్‌.. ఇలా ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములూ ఉంటాయి. పావు నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి పావు వచ్చినప్పుడు పాము మింగేసిందంటూ.. పావు పాము తోక చివరి వరకూ కిందికి దిగిపోతుంది. పటంలో పైన ఉన్న పెద్దపామును తప్పించుకున్నామంటే దాదాపు ఆట గెలిచినట్టే. తర్వాత ఎంత పడితే ఆట గెలుస్తామో అంత పడేవరకూ మనం వేచి ఉండాల్సిందే. పిల్లలూ అన్ని ఆటలు ఎలా ఆడాలో తెలుసుకున్నారు కదా! ఇక లాక్‌డౌన్‌ రోజుల్ని మీకిష్టమైన ఆటలతో ఎంజారు చేయండి!!