DailyDose

ఒక్కరు కూడా ఆకలితో బాధపడకూడదు-తాజావార్తలు

YS Jagan Wants Everyone Get Food During COVID19

* దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. తీర్థయాత్రలకు వెళ్లిన 34 మంది వారణాసిలో చిక్కుకున్నారని లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. యాత్రీకులకు సహాయం అందించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న తెలుగువారి వివరాలు, ఫోన్‌ నంబర్లను ట్విటర్‌లో పోస్టు చేశారు. వారంతా వారణాసిలోని నటరాజన్‌ హోటల్‌లో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

* రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లతో చర్చలు జరిపి తెలంగాణ సమగ్ర ధాన్యం, బియ్యం విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో కూడా చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. ‘‘ ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశముంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశముంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో మాత్రం రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రైస్‌ బౌల్ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తు ఉండకూడదని కలెక్టర్లకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారని మంత్రి కన్నబాబు చెప్పారు. శిబిరాల్లో ఉన్నవారి నాణ్యమైన భోజనం పెట్టాలనీ..అన్ని వస్తువులు అందుబాటులో ఉంచాలనీ సీఎం ఆదేశించారన్నారు. సోమవారం కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష వివవరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ‘‘అర్బన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కరోనాపై దృష్టి పెట్టాం. ప్రతి ఇంటిని.. ప్రతి రోజు సర్వే చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి వాలంటీర్లను ఏర్పాటు చేస్తాం. సర్వే అనేది ఒక్క రోజు చేసి వదిలేసేది కాదు. గుండె జబ్బులతో బాధపడేవారిని గుర్తించాలి. బుధవారం నాటికి 8450 బెడ్లు, 515 ఐసీయూ బెడ్‌లు, 448 వెంటిలేటర్‌బెడ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు కొవిడ్‌ ఆస్పత్రులను పర్యవేక్షించాలి. నియోజకవర్గ స్థాయిలో క్వారంటైన్‌కి వస్తామనే వారినే అనుమతిస్తాం. ఏ ఒక్కరు పస్తు ఉన్నా సహించనని సీఎం చెప్పారు. హోటళ్లు, కల్యాణమండపాలు క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కోసం వినియోగిస్తాం. సరిహద్దులో ఉన్న శిబిరాలను కూడా అధికారులు పరిశీలించాలి’’ అని మంత్రి వివరించారు.

* రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్‌, చేపల లభ్యతపై మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌తో జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయని తలసాని వివరించారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్లు, గుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు.

* దేశమంతా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై అధికారులు రోడ్డుపై కెమికల్స్‌ స్ప్రే చేశారు. దీనిలో పిల్లలు కూడా ఉన్నారు. ఇది చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ప్రముఖలు ఈ చర్యను తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

* నావెల్‌ కరోనా వైరస్‌ సోకితే ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. ఫైబ్రోసిస్‌ వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని తెలిసిన సంగతే. గుండె పనితీరూ దెబ్బతింటోందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. అంతకు ముందు హృద్రోగాలు లేని వ్యక్తుల గుండె కండరాలు దెబ్బతింటే ఇక అప్పటికే ఉన్నవారిలో సమస్య మరింత జటిలంగా కనిపిస్తోందని వెల్లడించింది. హృదయంపై కరోనా ప్రభావాన్ని ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం వైద్యశాస్త్ర కేంద్రం పరిశోధకులు తెలిపారు. జామా కార్టియాలజీ జర్నల్‌లో ఫలితాలను ప్రచురించారు.

* కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని సేవలు కూడా రానున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్‌పేషంట్‌ సేవలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటిలేటర్స్‌, ల్యాబ్స్‌, వైద్యులు, నాన్‌ మెడికల్‌ సిబ్బంది సేవలు ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి.

* తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. పదోతరగతి పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. మహమ్మారి కరోనా ప్రపంచ వ్యాప్తంగా భయానక రీతిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలన్నీ మూతపడ్డాయి. తొమ్మిదో తరగతి వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తర్వాతి క్లాసులకు ప్రమోట్‌ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి.

* ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ నివారణ ప్రస్తుతం మందు లేదు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. సినీ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా కరోనా తీవ్రత గురించి చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మోహన్‌బాబు తన ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

* లాక్‌డౌన్‌ సమయంలో వినియోగదారులకు అంతరాయం లేని సేవలు అందించాలని టెలికాం ఆపరేటర్లను నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కోరింది. ప్రీపెయిడ్‌ చందాదారుల ప్రస్తుత పథకాల కాలపరిమితి (వాలిడిటీ)ని పెంచాలని సూచించింది. ప్రాథమ్యాల మేరకు వినియోగదారులకు సేవలందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరింది.

* కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. ఆదిలాబాద్‌ జిల్లాలోకి రాగానే ఆర్డీవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు వారిని అడ్డుకున్నారు. ఉభయ గోదావరి, ఖమ్మం, కరీంనగర్‌, గుంటూరు, వరంగల్‌, నల్గొండ, విజయవాడ ప్రాంతాలకు చెందిన సుమారు 105 విద్యార్థులను అడ్డుకుని సమీపంలోని మైనారిటీ గురుకులంలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

* మహమ్మారి కరోనాతో యావత్‌ ప్రపంచమే లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ వాహనాలు నిల్చిపోయాయి. మార్కెట్లు బంద్‌ అయ్యాయి. జనజీవనం స్తంభించింది. కోట్లాదిమంది తమ ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ఈ వృద్ధ ప్రేమికులను మాత్రం కరోనా ఏ రకంగానూ అడ్డుకోలేకపోవడం విశేషం..అవును ఈ ప్రేమికుల వయసు ఇది.. అతని పేరు హన్‌సెన్‌ ఆమె పేరు ఇంగా రాస్‌ముసెన్‌. ఆయన జర్మనీలో నివసిస్తుండగా ఆమె డెన్మార్క్‌లో ఉంటోంది. కరోనా నేపథ్యంలో డెన్మార్క్‌ తన సరిహద్దులను మూసివేసింది. అనంతరం కొద్దిరోజులకే జర్మనీ కూడా మూసివేసింది. దీంతో ప్రతిరోజు కలుసుకొని కబుర్లు చెప్పుకునే వీరికి చాలా కష్టం కలిగింది. అయితే ప్రతిరోజు తమ దేశ సరిహద్దుల వరకు చేరుకుంటున్నారు. బారికేడ్‌కు ఇరుపక్కల కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఫ్లాస్క్‌లో తెచ్చిన కాఫీ ఇచ్చిపుచ్చుకుంటారు.