NRI-NRT

అమెరికాను ముంచెత్తుతున్న కరోనా-TNI ప్రత్యేకం

Current Situation Of CoronaVirus In USA-TNILIVE Specials

*** 160000 దాటిన బాధితులు.
*** 3000 దాటిన మరణాలు
*** తల్లడిల్లుతున్న న్యూయార్క్

కరోనా మహమ్మారి చైనా, ఇటలీలను ముంచెత్తి అమెరికా వైపు ఉధృతంగా సాగుతోంది. దీంతో అగ్ర రాజ్యం అతలాకుతలం అవుతుంది. చైనాలో కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరాన్ని మరిపించే విధంగా ప్రస్తుతం కోవిడ్-19 న్యూయార్క్ ను చుట్టుముడుతోంది. ప్రతి గంటకు కేసుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 5 గంటల సమయానికి న్యూయార్క్ తో పాటు ఆ రాష్ట్రంలో 59,568 మందికి కరోనా వైరస్ సోకింది, 965 మంది మృతిచెందారు. న్యూయార్క్ నగరం అమెరికా ఆర్ధిక మూలాలకు ఆయువుపట్టు కావడంతో అక్కడ లాక్ డౌన్ ను నిర్భందం చేయడానికి ట్రంప్ సర్కార్ వెనుకాడుతుంది. ట్రంప్ నివాసం ఉండే న్యూయార్క్ ను సందర్శించడానికి ఆయన వెనుకాడుతున్నట్లు సమాచారం, ఆయన భద్రతా దళం ట్రంప్ న్యూయార్క్ పర్యాటనను నిరోధిస్తున్నట్లు సమాచారం. కరోనా విధులు నిర్వహిస్తున్న 300 మంది న్యూయార్క్ పోలీసులకు ఈ వ్యాధి సోకింది. మెట్రో రైళ్ళు యధావిధిగా నడుస్తున్నాయి. రోడ్ల పైన అక్కడక్కడా కార్లు తిరుగుతున్నాయి. నిత్యావసర సరుకుల కోసం దుకాణాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. వచ్చే వారం రోజులలో న్యూయార్క్ లో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరవచ్చని ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని పిలుపునిచ్చారు. పక్కనే ఉన్న న్యూజర్సీ, కనెక్టికట్ రాష్ట్రాలకు కరోనా శరవేగంగా విస్తరిస్తుంది.

*** ఇరువురు తెలుగు వారికి కరోనా వైరస్
కరోనా ధాటికి అమెరికా నలుమూలల ఉన్న తెలుగు వారిలోనూ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. న్యూయార్క్ లో ఒక తెలుగు యువకుడికి కరోనా సోకింది, అయితే అతను కోలుకున్నాడు. ప్రస్తుతం అతని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ యువకుడు తన అనుభవాలను నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ వెబినార్ లో (కరోనా అవగాహన) వివరించాడు. కాలిఫోర్నియాలో ఒక వృద్ధ తెలుగు మహిళకు కరోనా వ్యాధి సోకి మరణించినట్లు సమాచారం. న్యూయార్క్ పరిసరాల్లో నివసిస్తున్న ఇరువురు తెలుగు వైద్య దంపతులకు కరోనా సోకిందని, వారు కోలుకున్నారని సమాచారం. మరొక పక్క మన తెలుగు వారు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే ‘పటేల్ బ్రదర్స్’ దుకాణాలను మూసివేశారు. దీంతో మన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియాలో అక్కడి యంత్రాంగం నిర్భంద లాక్ డౌన్ ను విధించింది, ప్రజలు బయటకి రాకుండా కట్టడి చేసింది. దీనితో అక్కడ కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అవసరమైతే మే 1 వరకు లాక్ డౌన్ కు సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సోమవారం నాడు బులిటెన్ ను విడుదల చేసింది. చికాగోలో ఒక చిన్నరి బాలిక కరోనాతో మృతిచెందడం అమెరికా అంతట కలకలం రేపింది. మొత్తం మీద ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఏప్రిల్ 15 నాటికి కట్టడి చేయకపోతే అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరిన ఆశ్చర్య పోవలిసిన పరిస్థితి లేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.