DailyDose

కేరళలో మద్యం కోసం ప్రత్యేక పాసులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Kerala To Issue Special Passes For Drunkards

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం లభించక వింతగా ప్రవర్తిస్తున్న వారు మద్యం కొనుగోలు చేసుకునేలా అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు జారీచేయాలని నిర్ణయించింది. అయితే దీనికి వైద్యుల నుంచి మద్యానికి బానిస అయినట్లుగా ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంది. అప్పుడే ఎక్సైజ్‌ శాఖ వారికి అనుమతిస్తుంది. దీన్ని వైద్యుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికి.. మందు బాబులు సమాజంలో వింతగా ప్రవర్తించడం, ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మద్యం దుకాణాలను తెరిచేది కేవలం వాళ్ల ప్రయోజనం కోసమేని స్పష్టం చేసింది.‘‘లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు మూసివేయడంతో ఎంతో మంది మద్యానికి బానిసైన వారు మతితప్పి వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు వైద్యుల దగ్గరి నుంచి మద్యం లేకుండా ఉండలేని స్థితిలో ఉన్నామనే పత్రాన్ని తీసుకురావాలి. అప్పుడు వారికి తగిన మోతాదులో మాత్రమే మద్యం అందిస్తాం’’ అని వెల్లడించింది. వైద్యులు అందించిన పత్రాన్ని సమీపంలోని ఎక్సైజ్‌శాఖ కార్యలయంలో చూపిస్తే పాస్‌లు అందిస్తామని తెలిపింది.అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్‌ మెడికల్ అసోషియేషన్‌ (ఐఎమ్‌ఏ) తీవ్రంగా తప్పుపట్టింది. ఇది పూర్తిగా అశాస్త్రీయమని పేర్కొంది. ‘‘మద్యానికి బానిసైన వారికి శాస్త్రీయ పద్ధతిలో ఇంట్లో లేదా ఆసుపత్రిలో చికిత్స చేయాలి. లేదా ఆసుపత్రిలోనే ఉంచి మందుల ద్వారా నయం చేయడానికి ప్రయత్నించాలి’’ అని ఐఎమ్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు అబ్రహం వర్గీస్‌ తెలిపారు. కేరళలో మద్యానికి బానిస అయిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

* కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదని ఎత్తిచూపడం లేదన్నారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

* కరోనా వైరస్‌ పాతదే కానీ కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తోందని హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 77 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మృతిచెందారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 14 మంది కోలుకున్నారన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అనేక వైరస్‌లను మనం దిగ్విజయంగా ఎదుర్కొన్నాం. లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటిస్తే వైరస్‌ గొలుసును ఛేదించగలం. అప్రమత్తంగా ఉండాలి. చేతుల శుభ్రం చేసుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలి. కరోనా వల్ల మరణాలు 2 నుంచి 3 శాతమే’’ అని శంకర్‌ వివరించారు.

* కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పారు. కరోనా గురించి అనేకమంది నిపుణులతో చర్చించానని, కరోనా పాజిటివ్‌ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు.

* తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 97కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా.. 14 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 77 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

* అయ్యయ్యో.. ఇటలీ! తల్చుకుంటేనే కన్నీరు ఉబికివస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశానికి శాపంగా మారింది. మార్చిని ఎప్పటికీ మర్చిపోలేని నెలగా మార్చేసింది. పదులా.. వందలా.. నేటికి 11,591 మంది కొవిడ్‌-19తో చనిపోయారు. మరణించిన వారి స్మారకార్థం మంగళవారం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. మౌనం పాటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి. ‘ఈ వైరస్‌ ఒక గాయం. అది దేశమంతా గాయపర్చింది’ అని రోమ్‌ మేయర్‌ వర్జీనియా రాగి మౌనం పాటించిన తర్వాత అన్నారు. ‘మనందరం కలసికట్టుగా దీనిని ఎదుర్కొందాం’ అని పేర్కొన్నారు.

* ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు 200 దేశాలకు విస్తరించిన కొవిడ్‌ 19.. భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1418 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య 45కి చేరినట్టు తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 167 కేసులు నమోదవ్వగా.. 13 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని 123 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

* వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.

* రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు కాంగ్రెస్‌ పార్టీ తన వంతు సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే ధనిక రాష్ట్రం అని చెబుతూనే నేడు ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారని.. కేవలం 8 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

* ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే వీరి బంధంపై గుత్తా తాజాగా స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. ‘అవును.. మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం’ అని తేల్చి చెప్పారు.

* భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం అమలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల గురించి తమ శాఖలకు తెలియజేశాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆర్థికంగా కాస్త వెలుసుబాటు కల్పించేందుకు కాలపరిమితితో కూడిన రుణ వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్‌బీఐ సూచించింది.

* లాక్‌డౌన్‌ సమయంలో నగరాల నుంచి వలస కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోతున్నారు. ముఖ్యంగా దిల్లీ నుంచి సమీప రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు కాలినడక తరలివెళ్తున్న ఘటనలు దేశాన్నే కలచివేశాయి. అయితే ఇలా వెళ్తున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరి ద్వారా కరోనా వైరస్‌ గ్రామాలకు సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

*