DailyDose

18ఏళ్ల కనిష్ఠానికి చమురు ధరలు-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Oil Prices At 18Year Low

* ఏప్రిల్‌ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.4.88 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం అప్పుగా తీసుకురానుంది. కరోనా వైరస్‌ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి అన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో అంచనా వేశారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లే కావడం గమనార్హం. స్థూల రుణాల్లో పాత అప్పుల చెల్లింపులు సైతం ఉంటాయి. ఇక నికర రుణాలు 2020-21కి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. 2019-20లో ఇది రూ.4.99 లక్షల కోట్లు కావడం గమనార్హం.

* కరోనావైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ నిర్వహించడంతో దేశంలో అనేక రకాల పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. వీటిల్లో ఆటోమొబైల్‌ రంగం ఒకటి. బీఎస్‌-4 వాహనాలు స్టాక్‌ ఉండిపోవడం.. వాటిని విక్రయించే మార్గాలు మూసుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు వీరికి లాక్‌డౌన్ తర్వాత 10 రోజుల పాటు విక్రయించుకొనే అవకాశం కల్పించింది. మరోపక్క బీఎస్‌-6 వాహనాల కోసం ఆటోమొబైల్‌ తయారీదార్లు ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. ఈ సేవలకు టాటామోటార్స్‌ మరో కొత్త సౌకర్యాన్ని జోడించింది. తమ కంపెనీ విక్రయించే కార్లు మొత్తానికి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఏర్పాటు చేసి వాటికి హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పించింది.

* వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.

* భారత స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కరోనా భయం ఇంకా కొనసాగుతున్నప్పటికీ మదుపర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ 1,028.17 పాయింట్లు లేదా 3.62 శాతం, లాభపడి 29,468.49 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఏకంగా 316.65 పాయింట్లు (3.82%) ఎగబాకి 8597.75 వద్ద ముగిసింది. 1495 కంపెనీల షేర్ల ధరలు పెరగగా 767 సంస్థల షేర్ల ధరల తగ్గుముఖం పట్టాయి. 150 కంపెనీల షేర్ల ధరల్లో మార్పు లేదు.

* అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినా.. మన దేశంలో మాత్రం ఆ ప్రయోజనం వినియోగదారులకు లభించడం లేదు. చమురు ధరలు తగ్గడంతో కలిగిన ప్రయోజనాన్ని, కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ సుంకం చెల్లింపులకు దేశీయ చమురు విక్రయ కంపెనీలు సర్దుబాటు చేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 23 డాలర్లకు పడిపోయింది. 2002 నవంబరు తర్వాత ఇంత కనిష్ఠానికి చేరడం ఇప్పుడే. అయితే దేశీయంగా పెట్రో ధరల్లో పెద్ద మార్పు రాలేదు. ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. దీంతో ఈ రెండింటి ధరలు లీటరుకు రూ.3 వరకు పెరగాల్సి ఉంది. కంపెనీలు మాత్రం ధరలు పెంచకుండా.. చమురు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని పెరిగిన ఎక్సైజ్‌ సుంకానికి సర్దుబాటు చేస్తూ వస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ చమురు ధరలు బాగా దిగివచ్చినా.. మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు యధాతథంగానే కొనసాగుతున్నాయి. మార్చి 16న దేశీయంగా కంపెనీలు చివరిసారి ధరలు సవరించాయి. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.69.59, డీజిల్‌ ధర రూ.62.29 ఉండగా, ముంబయిలో లీటరు పెట్రోలును రూ.75.30; డీజిల్‌ను రూ.65.21 ధరకు విక్రయిస్తున్నారు. మార్చి 14న ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం పెంచడంతో పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకం లీటరుకు రూ.22.98, డీజిల్‌పై రూ.18.83 మేర పెరిగింది.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్యరాజ్య సమితి మరోసారి పునరుద్ఘాటించింది. ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయని అంచనా వేసింది. భారత్‌, చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ‘యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్’(యూఎన్‌సీటీఏడీ) ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో ఎక్కువ జనాభా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని.. వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కోనున్నారని స్పష్టం చేసింది. ఈ దేశాలకు రూ.2.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ దేశాలు రెండు నుంచి మూడు లక్షల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను సైతం కోల్పోనున్నాయని అంచనా వేసింది. అయితే భారత్‌,చైనా ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

Energy :: Trump, Putin agree to discussions on oil between energy ...