Fashion

వివాహ దండలకు కూడా ఫ్యాషన్ ఉంది

Telugu Wedding Fashion News - Indian Marriage Garland Fashion

‘రఘువంశరామయ్య…సుగుణాల సీతమ్మ… వరమాలకై వేచు సమయాన…’అంటూ పెళ్లిళ్లలో వరమాల ప్రాధాన్యం చెప్పాడో సినీ కవి. అనాటి రామయ్య కాలం నుంచీ ఈనాటి స్మార్ట్‌ యుగం వరకూ వరమాల లేని పెళ్లి తంతుని ఊహించలేం. అందుకు తగ్గట్టుగానే ఆ పూలదండలు అప్‌డేట్‌ అవుతూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముస్తాబై వధూవరులకు కొత్తకళ తీసుకొస్తున్నాయి.

ఈ కాలం యువత పెళ్లిని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు.నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్‌ వరకూ ప్రతి ఘట్టాన్నీ ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. వీటిలో చెప్పుకోదగింది పూలదండలు మార్చుకునే తంతు. సిగ్గుల మొగ్గవుతూ వరుడి మెడలో మాల వేయడానికి వధువు సిద్ధమైతే… ఆమెని ఆట పట్టిస్తూ మాల వేయనీయకుండా అతని స్నేహితులూ బంధువులూ పెళ్లి కొడుకును వెనక్కి లాగడం, అందకుండా ఎత్తుకోవడం వంటివి చేస్తుంటారు. వధువు తరపు బంధువులు కూడా… వరుడు మాల వేయకుండా ఆటపట్టిస్తూ వివాహ వేడుకను మరింత సంబరంగా మార్చేస్తున్నారు. అందుకే పెళ్లిలో అంత ప్రాధాన్యమున్న వరమాలను సాదాసీదాగా కాకుండా కస్టమైజ్డ్‌ తరహాలో ఎంచుకుంటున్నారు.

పెళ్లిలో ప్రధానమైన ఆ దండల ప్రస్తావన ఈనాటిది కాదు. రాముడు శివధనుస్సు విరవగానే సీతమ్మ ఆ దండతోనే రాముడిలో భాగమైంది. ద్రౌపది కూడా స్వయంవరంలో అర్జునుడిని వరమాలతోనే వరించింది. దీన్నే జైమాల అని కూడా పిలుస్తారు. ఏ పేరుతో పిలిస్తేనేం, ఆ పూలదండలు ఆనాటి నుంచి ఈనాటి వరకూ పెళ్లిలో ముఖ్య భాగమయ్యాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం అయితే దండలు మార్చుకోవడమే అసలైన పెళ్లిగానూ భావిస్తారు. హిందూ సంప్రదాయంలో నిశ్చితార్థంలో పూలదండలు మార్చుకుంటే సగం పెళ్లైందని చెబుతారు. ఆ దుస్తుల్లో దండలు ధరించిన వధూవరులు సాక్షాత్తూ దేవతా మూర్తుల్లానే కనిపిస్తారు. వారికి ఆ నిండుదనం, పరిపూర్ణత్వం తీసుకొచ్చేది వరమాలలే.సాధారణంగా గులాబీలూ, మల్లెలు, చామంతులూ, లిల్లీలు, టెంకీస్‌తో దండలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆర్కిడ్లూ, హైబ్రిడ్‌ గులాబీలూ, కార్నేషన్స్‌, తామర మొగ్గలూ, కలువ పూల వంటివీ వచ్చి చేరాయి. వేదిక అలంకరణా, వధూవరుల దుస్తుల రంగూ, వధువు పూలజడకు తగ్గట్టుగా వారివారి అభిరుచులకు అనుగుణంగానూ రకరకాల పూలతో వరమాలను డిజైన్‌ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా ఒకే రకం పూలతో దండల్ని గుచ్చడం, అచ్చంగా పూరేకులతో మాల అల్లడం, రంగుల మేళవింపుకోసం పలు రకాల పూలను దండలో జత చేయడం వంటివి చేస్తున్నారు. కొన్నిసార్లు పూలకు కృత్రిమ రంగుల్నీ స్ప్రే చేసి కొత్త వర్ణంలోకి మార్చేసి ఎంతో అందంగానూ మరింత విభిన్నంగానూ దండల్ని రూపొందిస్తున్నారు. పూల మార్కెట్లతోపాటు పలు ఆన్‌లైన్‌ సంస్థలు కూడా ఇప్పుడు కస్టమైజ్డ్‌ వరమాలల్ని తయారుచేసి ఇస్తున్నాయి. మరి మీకు నచ్చిన దండను డిజైన్‌ చేయించుకోవడమే ఆలస్యం.

Wedding Garlands

All About Wedding Garlands – India's Wedding Blog