Business

బంగారం ధర తగ్గుతోంది

Gold Prices Coming Down Due To Corona

కరోనా వైరస్ దెబ్బకు గోల్డ్ ధరలు కూడా దిగొస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో లాక్‌‌డౌన్ ఉండటంతో ఫిజికల్ డిమాండ్‌‌పై ప్రభావం చూపుతోంది. దీంతో అత్యధిక స్థాయిల నుంచి గోల్డ్ ధరలు.. మెల్లమెల్లగా కిందకు జారుతున్నాయి. ఇండియాలో వరుసగా నాలుగో రోజు గోల్డ్ ధరలు పడిపోయాయి. ఎంసీఎక్స్ జూన్ ఫ్యూచర్స్‌‌లో గోల్డ్ ధరలు 10 గ్రాములకు 0.6 శాతం తగ్గి రూ.42,693గా నమోదయ్యాయి. గత మూడు సెషన్స్‌‌లో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.400 మేర తగ్గాయి. ఇదే సమయంలో ఎంసీఎక్స్ మే ఫ్యూచర్స్ లో సిల్వర్ కొనుగోళ్లు పెరిగాయి. కేజీ సిల్వర్ ధర 0.2 శాతం పెరిగి రూ.39,600గా నమోదైంది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ కొనసాగుతుండటంతో, కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌‌ సమయాన్ని 8 గంటలకు తగ్గించాయి. అంటే ఏప్రిల్ 14 వరకు కమోడిటీస్ ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే జరుగనుంది. ఫిజికల్ డిమాండ్‌‌ తగ్గిందని, దీంతో అత్యధిక స్థాయిల వద్ద గోల్డ్ ధరలు ఒత్తిడికి గురవుతున్నాయని అనలిస్ట్ లు అన్నారు. కరోనా మహమ్మారితో గోల్డ్‌‌కు అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో ఈ మార్కెట్‌‌ను నిషేధం విధించారు. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్‌‌డౌన్ ఉండటంతో డిమాండ్ దెబ్బతింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్‌‌ కొన్ని రోజుల పాటు గోల్డ్ కొనుగోళ్లు జరపకూడదని నిర్ణయించింది. దీంతో ఫిజికల్‌‌గా గోల్డ్‌‌కు డిమాండ్ పడిపోతుంది. లాక్‌‌డౌన్ ఆంక్షలు ఉండటంతో ఫిజికల్ మార్కెట్ ట్రేడింగ్‌‌పై ప్రభావం పడుతోందని కొటక్ సెక్యురిటీస్ పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్‌‌లు, ప్రభుత్వాలు గోల్డ్ ధరలకు మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, కరోనా వైరస్‌‌ వల్ల ఎకానమీపై పడే భారాన్నితగ్గించాలని కొటక్ సెక్యురిటీస్ తెలిపింది. అటు గ్లోబల్‌‌గా మాత్రం గోల్డ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ బులియన్ మార్కెట్‌‌లో ఔన్స్‌‌కు 0.4 శాతం పెరిగి 1,577 డాలర్లుగా నమోదయ్యాయి. డాలర్ బలహీనంగా ఉండటంతో గత మూడు సెషన్స్‌‌లో 3 శాతం వరకు తగ్గిన గోల్డ్ ధరలు, బుధవారం పెరిగినట్టు తెలిసింది.