DailyDose

బ్రిటీష్ ఎయిర్‌వేస్ నుండి 36వేల మంది ఊస్టింగ్-వాణిజ్యం

Telugu Business News Roundup Today-80 Percent British Airways Employees To Be Laid Off

* కరోనా వైరస్ సంక్షోభం ఫలితంగా బిజినెస్ ట్రావెలర్ బ్రిటీష్ ఎయిర్‌వేస్ (బీఏ)భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కంపెనీ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్‌తో బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఒక ఒప్పందం కుదర్చుకోనుంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్‌, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి తొలగించనుది. అంతేకాదు రానున్న రెండు నెలల్లో సగం జీతానికే (50 శాతం వేతన కోత) పైలట్లు విధులను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి విమానయాన సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం.

* కరోనా సంక్షోభకాలంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని మరిన్ని ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సుమారు 200 పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది. పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగం పొందిన 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా నిలిపివేశామని ఎయిరిండియా సీనియర్ అధికారి గురువారం తెలిపారు. గత కొన్ని వారాలలో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోవడంతో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా ప్రకటించింది. రానున్న మూడు నెలల కాలానికి క్యాబిన్ సిబ్బంది మినహా అన్ని ఇతర ఉద్యోగుల జీత భత్యాల్లో 10 శాతం కోతను ఇప్పటికే తగ్గించింది. తాజాగా పైలట్ల నెత్తిన మరో పిడుగు వేసింది.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మహమ్మారి ప్రభావంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది గృహ విక్రయాలు 35 శాతం మేర తగ్గుతాయని ప్రాపర్టీ బ్రోకరేజ్‌ సంస్ధ అనరాక్‌ అంచనా వేసింది. కరోనా వైరస్‌ ప్రభావం వాణిజ్య (కార్యాలయ, రిటైల్‌) రియల్‌ఎస్టేట్‌పైనా ఉంటుందని పేర్కొంది. ప్రాపర్టీ మార్కెట్‌లో మందగమనం కొనసాగుతున్నా మెరుగైన సామర్ధ్యం కనబరుస్తున్న వాణిజ్య నిర్మాణ రంగంపై మహమ్మారి ఎఫెక్ట్‌ పడనుండటంతో మొత్తంగా నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

* కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది.

* కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. 2020 మార్చి 25 – ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.

* కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీ విరాళాలు ప్రకటించగా..తాజగా భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) తనవంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే భారతి సిమెంట్స్‌ ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కాగా, రాష్ట్రలో గురువారం ఉదయం 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 132 కి చేరాయి.