Editorials

రాయ్ రష్యా యాత్ర-6వ భాగం-ఇన్నయ్య ముచ్చట్లు

MN Roy Russia Trip After Lenin Invited Him-Innaiah Narisetti Stories-Part6

6. లెనిన్ పిలుపు పై రాయ్ రష్యా యాత్ర

దారిలో జర్మనీ చేరుకున్న ఎమ్.ఎన్.రాయ్ దంపతులు
మెక్సికోలో సోషలిస్టు పార్టీని స్థాపించి దానికి ప్రధాన కార్యదర్శి అయిన ఎమ్.ఎన్.రాయ్, బరోడిన్ ప్రోత్సాహంతో కమ్యూనిస్టుగా మారి, సోషలిస్టు పార్టీని కూడా కమ్యూనిస్టు పార్టీగా మార్చేశారు. రష్యా నుండి లెనిన్ ఆహ్వానంతో మాస్కో బయల్దేరాడు. దీనికి గాను తగిన ఏర్పాట్లన్నీ మెక్సికోలో గుట్టుచప్పుడు కాకుండా చేసుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవిని మరొక వ్యక్తికి అప్పగించి అతనికి తగిన నిధులు సమకూర్చి రాయ్ దంపతులు పయనమయ్యారు.
కొన్నాళ్ళపాటు మెక్సికోలో అదృశ్యమై వెరా క్రూజ్ వద్ద అల్ ఫోన్సో 13 అనే ఓడలో ప్రవేశించారు. ప్రయాణానికి తగిన పాస్ పోర్టు మారుపేరుతో సమకూర్చుకున్నారు. ఆ విధంగా రాయ్ దంపతులకు ప్రయాణం నిమిత్తం తాత్కాలికంగా కొత్త పేర్లు వచ్చాయి. రాబర్టో అలెని, విల్లా గార్సియా అనే కొత్తపేర్లు ఓడ ప్రయాణానికి వాడుకున్నారు. వారి తొలి మజిలీ క్యూబాలోని హవానా రేవు. అప్పట్లో ఆ ప్రాంతం అమెరికా వారికి అనుకూలంగా వున్నది. ఆగిన ఓడల్ని అమెరికా వారు పరిశీలించే హక్కువున్నది. అయితే ఓడ కెప్టెన్ రాయ్ దంపతులను రక్షణ నిమిత్తం దాచిపెట్టాడు. అక్కడ ఓడ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కనుక ఎన్నాళ్ళకు ఓడ బయల్దేరుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే క్యూబా లేబర్ ఫెడరేషన్ కార్యదర్శి సోషలిస్టు, మెక్సికోలో రాయ్ కు పరిచయమయ్యారు. రాయ్ ఒక సందేశాన్ని అతనికి పంపించగలిగాడు. అతడు స్వయంగా ఓడ దగ్గరకు వచ్చి పరిస్థితి సమీక్షించి ఉదయం ఓడ బయల్దేరేటట్లు ఏర్పాట్లు చేసి వెళ్ళాడు. అప్పటివరకు రాయ్ దంపతులను ఓడలో రహస్యంగానే దాచి వుంచారు. అనుకున్నట్లు ఉదయాన్నే ఓడ బయల్దేరి ప్రయాణం సాగించటంతో రాయ్ దంపతులకు హవానాలో ప్రమాదం తప్పింది. ఓడలో రాయ్ దంపతులకు ఫ్రెంచి, జర్మన్, స్పానిష్ వారు పరిచయమయ్యారు.
అట్లాంటిక్ సముద్రంలో అలా ప్రయాణం చేస్తూ లా కోరును రేవులో ఆగింది. అక్కడ నుండి పారిస్ – లిస్బన్ ఎక్స్ ప్రెస్ లో స్సెయిన్ రాజధాని మడ్రిడ్ కు చేరుకున్నారు. అక్కడ ఇగ్లిసియాస్ అనే లిబరల్ నాయకుడిని రాయ్ కలుసుకున్నాడు. అతడికి నచ్చచెప్పి మాస్కో రావలసిందిగా కోరడానికి అంతర్జాతీయ కమ్యూనిస్టు సమావేశంలో పాల్గొనవలసిందిగా రాయ్ ఎంత అడిగినా అతడు ససేమిరా ఒప్పుకోలేదు. నిరుత్సాహంతో రాయ్ మరికొంతమంది సోషలిస్టులను కలిసిి మాస్కోకు ఆహ్వానించారు. మెక్సికోలో వుండగా తనకు పరిచయమైనవారిని కలసి అంతర్జాతీయ సభలో పాల్గొనటానికి వప్పించారు. ఆ విధంగా తొలి విజయం సాధించి జర్మనీ బయల్దేరారు. నగరంలో ఒక చేతి కర్రను కొనడానికి రాయల్ పాలస్ కు వెళ్ళి కావాలనుకున్న పొడవాటి చేతి కర్రను కొన్నారు. టాక్సీ తీసుకుని తానున్న హోటల్ కు వెళ్ళారు. జేబులో చేతులు పెట్టి పర్సు తియ్యబోతే అది కనబడలేదు. రాయ్ కాసేపు బిత్తరపోయి తాను చేతి కర్ర కొన్న షాపుకు వెళ్ళాడు. రాయ్ ని చూడగానే కౌంటర్ దగ్గర అతను రాయ్ కు పర్సును అందజేశాడు. రాయ్ అతనికి ధన్యవాదాలు చెప్పేబదులు ఆత్రుతగా పర్సు తెరిచి తన పాస్ పోర్టు ఇతర వస్తువులు, డబ్బు ఉన్నాయో లేదో చూసుకున్నారు. కనీసం థాంక్స్ చెప్పనందుకు కౌంటరు దగ్గర వ్యక్తి ఆగ్రహంతో రాయ్ ను ఉద్దేశించి, “స్పెయిన్ వారు దొంగలు కారు. మీ డబ్బంతా ఉందో లేదో లెక్క చూసుకోండి” అని కోపంగా అన్నాడు. రాయ్ కు నోటమాటరాలేదు.
కొన్నాళ్ళు అక్కడ వుండి రాయ్ దంపతులు జెనీవాకు ఓడలో బయల్దేరి తమ ప్రయాణాన్ని సాగించారు. తమకు కావలసిన ఉత్తరం బరోడిన్ నుంచి అందింది. బెర్లిన్ లో అడుగుపెట్టేసరికి విపరీతమైన చలి, ఎక్కడ చూసినా మంచు గడ్డలు కనిపించాయి. ప్రతి వారూ చేతులు చాపి సహాయం అడుగుతున్నారు. యుద్ధం ఆగిపోయిన తరవాత ఓడిపోయిన జర్మనీలో చాలామంది సైనికులు సైతం అలా అడుక్కుంటున్నారు.

Lenin and Roy: the enemies Of British India

ఫుర్ స్టాన్ హోఫ్ హోటల్
ముందు ఏర్పాట్ల ప్రకారం బెర్లిన్ నగరం మధ్యలో వున్న పెద్ద హోటల్ ఫుర్ స్టాన్ హోఫ్ (FUERSTENHOF – Phurstanhoph) కు చేరుకున్నారు. రాయ్ దంపతుల వద్ద చాలా లగేజి వున్నది. అదంతా హోటల్ ద్వారం వద్ద పడేసి తమకు గది కావాలని అడిగాడు. తమ మెక్సికో పాస్ పోర్టు చూపెట్టి తాను వుండటానికి గది చూపెట్టమన్నాడు. ఆ రాత్రికి ఎక్కడైన వుండమని పొద్దున్నే వస్తే గది ఇస్తామని చెప్పారు. అక్కడ వున్న హోటల్ వ్యక్తి రాయ్ భారతీయుడని తెలుసుకుని సానుభూతిగా వ్యవహరించాడు. సామానంతా అక్కడ భద్రం చేసి రాయ్ దంపతులను రాత్రికి మరోచోట అట్టిపెట్టారు. ఇదంతా చేసినందుకు ఐదు డాలర్లు అతని చేతిలో పెడితే ఉప్పొంగిపోయి సహాయపడ్డాడు. రాత్రి వుండడానికి ఒక గది అప్పగిస్తే అక్కడ చాలా చలిగా వున్నాఅలాగే తెల్లవారే వరకు ఉండి మర్నాడు ఉదయం అన్ని సౌకర్యాలు వున్న హోటల్ కు చేరుకున్నారు. అది బెర్లిన్ లో రాయ్ దంపతుల తొలినాటి అనుభవం.
జర్మనీ డబ్బుతో, ఆయుధాలతో ఇండియాలో బ్రిటీషు వారిని ఓడించి తరిమేయాలని తలపెట్టి బయలుదేరిన ఎమ్.ఎన్.రాయ్, నాలుగేళ్ళ తర్వాత గానీ ఆ దేశంలో అడుగుపెట్టలేకపోయారు. ఈలోగా అనూహ్యమైన మార్పులెన్నో ఆయన జీవితంలో సంభవించాయి. అమెరికాలో ఎవిలిన్ ను పెళ్ళి చేసుకోవటం, అరెస్టు తప్పించుకుని మెక్సికో చేరుకోవటం, కొత్తగా సోషలిస్టు పార్టీని స్థాపించి తద్వారా రష్యాలో లెనిన్ దృష్టిని ఆకర్షించటం చెప్పుకోదగిన జీవిత మలుపులు. మొత్తం మీద లెనిన్ ఆహ్వానంపై మెక్సికో ప్రతినిధిగా మాస్కో చేరుకోవడానికి బయలుదేరిన రాయ్ దంపతులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ దాటుకొని ముందుగా జర్మనీలో అడుగుపెట్టారు.
రాయ్ భావించిన, ఊహించిన జర్మనీ లేదు. ఆర్థికంగా చితికిపోయి యుద్ధంలో ఓడిపోయి, మనుగడ సాగించడానికి తిప్పలు పడుతున్న జర్మనీలోకి రాయ్ దంపతులు ప్రవేశించారు. అక్కడ నుండి రష్యా వెళ్ళవలసి వున్నది. అందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రయాణానికి సిద్ధం కావాలి. అది జరగడానికి కొన్ని నెలలు బెర్లిన్ లోనే రాయ్ దంపతులు గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో రష్యా ఒకటే కమ్యూనిస్టు రాజ్యం. దానిని ఇతర దేశాలు గుర్తించలేదు. కనుక రష్యా పోవాలంటే పాస్ పోర్టులు, వీసాల విషయంలో చాలా ఇబ్బందిగా వుండేది. జర్మనీలో కూడా రహస్యంగా గడపవలసి వచ్చేది.
అయితే కాలం వృధాపుచ్చకుండా జర్మనీలో ఉన్న కమ్యూనిస్టులను రాయ్ దంపతులు తరచు కలుసుకున్నారు. కొందరితో బాగా సన్నిహితులయ్యారు. కమ్యూనిజానికి, మార్క్స్ కు పుట్టినిల్లయిన జర్మనీ అనేక కమ్యూనిస్టు ముఠాలతో సతమతమవుతున్నది. వీరోచితంగా ఉద్యమాన్ని నిర్మించిన రోజా లక్సెంబర్గ్ అప్పటికి చనిపోయింది. ఆమె అనుచరులు వేరే ముఠాలలో చేరిపోయారు. వీరంతా అనేక సమావేశాలు జరుపుతూ పోరాటాలు సాగించటానికి వ్యూహాలు పన్నుతున్నారు. వారితో రాయ్ దంపతులు కలియడం వలన లోతుపాతులు బాగా తెలిశాయి. అందులో

ఎర్నామొరేనా (1885-1962) (జర్మన్ సినీతార – 1913-1951లోపున 104 సినిమాలలో నటించింది). కమ్యూనిస్టు రహస్యసమావేశాల్లో జర్మనీలో పాల్గొన్నప్పుడు రాయ్ దంపతులతో పరిచయం అయింది.

కారల్ రాడెక్ (1885–1939) (పోలీష్, జర్మనీ సాంఘిక ప్రజాస్వామ్య ఉద్యమాలలో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, రష్యన్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఒక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకుడిగా పనిచేశాడు),
హిల్ పెర్డింగ్ (Rudolf Hilferding 1923 –1923) (వీమర్ రిపబ్లిక్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD), సోషలిస్ట్ సిద్ధాంతకర్త, రాజకీయ నాయకుడు, ప్రముఖుడైన ఒక ఆస్ట్రియన్ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సైద్దాంతికుడు, వైద్యుడు),

ఆగస్ట్ థాల్ హైమర్
థాల్ హైమర్ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు. అతను పార్టీ వార్తాపత్రికలలో ఒకరైన Volksfreund, మరియు 1916 నుండి ఇండిపెండెంట్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ (USPD) యొక్క అధికారిక పత్రిక అయిన Spartakusbriefe పని చేసాడు. Thalheimer కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ (KPD) యొక్క స్థాపకుడు సభ్యుడు, అతను పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతకర్తగా గుర్తించబడింది.
డాక్టర్ పక్స్, స్నీవ్ లైట్, బెర్న్ స్టైన్, కాట్ స్కీ, విల్ హెళమ్ పెక్ లు సమావేశాలలో పాల్గొన్న వారిలో వున్నారు.
వారితో సమావేశాలు, చర్చలు రాయ్ దంపతులకు ఎంతో ఉపయోగపడ్డాయి. వారంతా జర్మనీ భాషలో మాట్లాడుకుంటుండేవారు. సారాంశాన్ని థాల్ హైమర్ తరువాత రాయ్ కి చెబుతుండేవారు.
భారతదేశానికి విప్లవ పోరాటాలలో సహాయపడదలచిన కొందరు జర్మనీ చేరుకుని కృషి చేస్తూ పోయారు. వీరిని బెర్లిన్ కమిటీ అనేవారు. ఇందులో కొందరు అమెరికాకు జపాన్ కు వెళ్ళగా మరికొందరు జర్మనీలో వుంటూ క్రమేణా కమ్యూనిస్టులుగా మారారు. వారిని గురించి వినడమే గాని అలా తొలిసారి కలుసుకోవడం జర్మనీలోనే రాయ్ కు తటస్థపడింది.
పేర్కొన దగిన వ్యక్తులు

వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ (1880 – 1937, Moscow) (కవయిత్రి సరోజినీ నాయుడు సోదరుడు)

భూపేంద్రనాథ్ దత్త (1880 – 1961)
(వివేకానంద సోదరుడు)

హర్ దయాళ్ (1884 – 1939), (భారతీయ జాతీయ విప్లవకారుడు. అతను ఇండియన్ సివిల్ సర్వీస్ లో వృత్తిని తిరస్కరించాడు. అతని సాధారణ జీవనం, మేథా చతురత మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ ఇంపీరియలిజంపై పోరాడటానికి కెనడా, అమెరికాలలో ఉన్న అనేక మంది పౌరులను ప్రేరేపించబడింది.)
వీరిలో పిళ్లై కూడా పేర్కొనదగినవారు.
అందులో కొందరు కమ్యూనిస్టులుగా మారి రష్యాకు కదిలిపోయారు. వారు రాయ్ ని కలుసుకోగలిగారు. ఆ విధంగా జర్మనీలో అనుభవాలు సంతరించు కుంటూ అంతర్జాతీయ కమ్యూనిస్టు సమావేశాలకు హాజరు కావటానికి రాయ్ దంపతులు సిద్ధపడ్డారు. వారిని మాస్కో తీసుకువెళ్ళవలసిన బాధ్యత బరోడిన్ ది. ఒకసారి ప్రయత్నించి సానుకూలత లభించక విరమించుకున్నారు కూడా. ఆ తరువాత బరోడిన్ మళ్ళీ ప్రయత్నించి ఎట్టకేలకు రాయ్ దంపతులను సెయింట్ పీటర్స్ బర్గ్ మీదుగా మాస్కోకు తీసుకెళ్ళడానికి గురలస్కీకి అప్పగించారు. బెర్లిన్ – మాస్కో నగరాలలో వుండగానే రాయ్ కు అవనీ ముఖర్జీ అనే వ్యక్తి కలిశాడు. ఇతను డాక్టర్ షహీర్ అనే మారుపేరుతోనే వ్యవహరించాడు. ఉత్తరోత్తర ఎమ్.ఎన్.రాయ్ రాసిన మారుతున్న భారతదేశం అనే రచన స్వతహాగా తనదని ప్రచారం చేసుకున్నాడు. విషయ నిర్ధారణకు పెట్టగా దారుణంగా విఫలమయ్యాడు. క్రమేణా రంగ నిష్క్రమణ చేశారు. చివరకు వూరూ పేరూ లేకుండా పోయాడు.
బెర్లిన్ లో వుండగా రాయ్ దంపతులు అనూహ్యంగా అనేకమందిని కలవడం అంతర్జాతీయ ముఠాల సమావేశాల్లో పాల్గొనడం చాలా పెద్ద జీవితానుభవం. మొత్తం మీద కలలుగన్న మాస్కోకు లెనిన్ గ్రాడ్ మీదుగా (ప్రస్తుతం దీన్ని సెయింట్ పీటర్స్ బర్గ్ అంటారు.) చేరుకున్నారు. హడావిడిగా లెనిన్ గ్రాడ్ నుచూసి వెళ్ళిపోయారు. అంతటితో మాస్కో యాత్రకు నాంది పలికారు. అక్కడ లెనిన్ నాయకత్వాన కమ్యూనిస్టు పాలన మొదలైన దశలో చవిచూశారు.
రాయ్ బెర్లిన్ నుంచి సోవియట్ అనే నౌకలో రేవాల్ వరకూ ప్రయాణం చేసి, తరువాత రైలులో లెనిన్ గ్రాడ్ చేరుకున్నారు.