Business

శంషాబాద్ నిండుగా విమానాలు

It's a visual treat to watch all flights parked in shamshabad

విమానయాన రంగం ఎప్పుడూ ఇంత గడ్డుకాలాన్ని చూసి ఉండదు. ఒక్క భారత్ లోనే కాదు..ప్రపంచమంతటా ఇవే సీన్లు. ఇలాంటి సన్నివేశాలు బహుశా మళ్ళీ జీవిత కాలంలో కన్పించకపోవచ్చు. ఎందుకంటే ఏ దేశంలో చూసినా..ఏ ఎయిర్ పోర్టులో చూసినా రన్ వేలు కూడా పూర్తిగా విమానాల పార్కింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు ఆ దేశం…ఈ దేశం అన్న సంబంధం లేకుండా ప్రపంచంలోని దేశాలు అన్నీ విమాన సర్వీసులకు బ్రేక్ ఇఛ్చాయి. దీంతో విమానాలు అన్నీ మూలనపడ్డాయి. ఎక్కడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడో..లేదా ఏదో ఒక ప్రాంతంలో ప్రత్యేక కారణాలతో అప్పుడప్పుడు విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడి ఉండొచ్చు. కానీ ప్రపంచం అంతా ఇంచుమించు కరోనా వైరస్ కారణంగా విమాన సర్వీసులు ఆగిపోవటం బహుశా ఇదే కావొచ్చు. గత ఏడాది డిసెంబర్ లో చైనాలోని ప్రముఖ పారిశ్రామిక హబ్ అయిన వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ తర్వాత ప్రపంచ విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకంగా బెయిల్ ఔట్ ప్యాకేజీలు ప్రకటించకపోతే విమానయాన సంస్థల కష్టాలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయని చెబుతున్నారు.

ముఖ్యంగా భారత్ లో విమానయాన రంగం ప్రభుత్వం ఆదుకోకపోతే దివాళా తీయటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పరిశ్రమ రంగం ఇఫ్పటికే ఈ మేరకు ప్రభుత్వానికి సంకేతాలు పంపి ఆదుకోవాల్సిందిగా కోరుతోంది. గత ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే దేశీయ విమానయాన రంగం నష్టాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. ఇఫ్పటికే ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ అయిన ఇండియన్ ఎయిర్ లైన్స్ తాత్కాలిక పైలట్లను తప్పిస్తోంది. దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ అయిన స్పైస్ జెట్ కూడా 30 శాతం మేర వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్ర,కటించింది. మిగిలిన ఎయిర్ లైన్స్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉంది. దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తున్నా..అంతర్జాతీయ సర్వీసులు ఇఫ్పటికిప్పుడే ప్రారంభం అయ్యే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దేశీయ సర్వీసులు మాత్రం ప్రారంభం అయ్యే అవకాశం కన్పిస్తోంది. ఈ దిశగా ఎయిర్ లైన్స్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.