DailyDose

2100 కిమీ కొరోనా సైకిల్ యాత్ర-తాజావార్తలు

Man Cycles 2100KM To See His Father During Lock Down-Telugu Breaking News Roundup

* దిల్లీలోని మర్కజ్‌ సమావేశానికి వెళ్లినవారిలో అనేకమందికి కరోనా సోకడం దురదృష్టకరమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పారు. ఇలా వైరస్‌ సోకడాన్ని అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాలన్నారు. కరోనా కాటుకు కులం మతం, ప్రాంతం, ధనిక, పేదా తేడా లేదని జగన్‌ పేర్కొన్నారు. కంటికి కనిపించని వైరస్‌పై మనమంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితులు తప్పు చేసినట్లుగా చూపించవద్దని కోరారు.

* దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ విషయం పేర్కొంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 1023 పాజిటివ్‌ కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు 22 వేల మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. 17 రాష్ట్రాల్లోనూ కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.

* నావెల్‌ కరోనా వైరస్‌ గతేడాది చివర్లో వుహాన్‌లో పురుడు పోసుకుంది. చైనాలోని ప్రధాన నగరాల్లో సంక్రమణ చెందింది. సరిహద్దులు దాటింది. విదేశాల్లో అడుగుపెట్టింది. దేశం మారినప్పుడల్లా దాడి చేసే పద్ధతిని మార్చుకుంది. ఇప్పుడు సమస్త భూమండలాన్నీ తన గుప్పిట బంధించింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలని లాక్‌డౌన్‌ చేయించింది. ఆధునిక వైద్య సదుపాయలకు పేరెన్నికగన్న అగ్రరాజ్యాలను వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని చిన్న చిన్న దేశాలు సమర్థంగా అడ్డుకున్నాయి. తజికిస్థాన్‌, దక్షిణ సుడాన్‌, యెమెన్‌, బురుండి, మాలవి, లెసెథో వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి లేదు. ప్రపంచానికి ఓ కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాలోనూ కరోనా కేసులు నమోదు కాలేదు. చైనాకు పక్కనే ఉండే ఈ దేశం ఇంతకీ ఏం చేసిందో తెలుసా!?

* ఆక్వా రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని కోరారు. సీఎం జగన్‌తో సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి ఎగుమతి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్‌ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కరోనా దృష్ట్యా ఆక్వా రైతులు, ఉత్పత్తుల రావాణాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని ఎంపెడా ఛైర్మన్‌కు సీఎం సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు.

* ప్రపంచ దేశాలన్నీ కరోనాతో విలవిలలాడుతుంటే కొన్ని దేశాలు మాత్రం ఆ మహమ్మారికి దూరంగా ఉంటున్నాయి. ప్రపంచానికి సుదూరంగా ఎక్కడో మూలలో ఉన్న దీవుల్లో కరోనా ఇంకా అడుగుపెట్టలేదు. అయితే తమకు రాదన్న ధైర్యంతో ఉండకుండా ఈ మహమ్మారి తమ దేశాల్లోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయీ ఈ చిట్టి దేశాలు.

* కరోనాపై పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఆర్థికంగా సాయం చేయటమే కాదు, సామాజిక మాధ్యమాల వేదిక ఆన్‌లైన్‌లోనూ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వామి అయ్యారు. తన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ తరపున పీఎం కేర్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి 50వేల కిట్లు పంపిణీ చేస్తామని అన్నారు.

* పంజాబ్‌లోని జలంధర్‌లో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. వాహనాలు రోడ్లపైకి రావడం లేదు. అనేక పరిశ్రమలు కూడా పనుల్ని ఆపేశాయి. జన సంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు రోడ్లపై తిరుగుతున్నాయి. మరోపక్క గాలి స్వచ్ఛత రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రకృతి అందాల్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. దానికి నిదర్శనంగా ఇప్పుడు ఇంటర్నెట్‌లో కొన్ని ఫొటో వైరల్‌ అవుతున్నాయి. గాలి స్వచ్ఛంగా మారడంతో జలంధర్‌ నగరంలోని ప్రజలకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధౌలాధర్ మంచు కొండలు దర్శనమిచ్చాయి. ఈ నగరంలోని ప్రజలకు ఇప్పటి వరకు ధౌలాధర్‌ కొండలు కనిపించలేదట.

* కరోనా వైరస్‌ను సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు ఆరంభించారు. ట్రయల్స్‌ సైతం మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ వాక్సిన్‌ విపణిలోకి రావాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన అందరిలోనూ ఊరట కలిగిస్తోంది.

* దేశ రాజధానిలో తబ్లిగీ జమాత్ కార్యక్రమం అనంతరం దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన తరువాత వీరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి అధికమయ్యింది. దీంతో దిల్లీ వెళ్లివచ్చిన తబ్లిగీలను గుర్తించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేపనిలో పడ్డారు అధికారులు.

* తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండడం, చివరి చూపైనా దక్కించుకోవాలనే ఆశ ఒక కొడుకును సైకిల్‌పై ముంబై నుంచి జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి వరకు 2100 కి.మీలు ప్రయాణించేలా చేసింది. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌కు చెందిన మహ్మద్‌ఆరిఫ్‌ ముంబైలో లిబ్రాటవర్‌ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం ఇంటి నుంచి ఆరిఫ్‌ భార్య ఫోన్‌చేసి అతని తండ్రికి గుండెనొప్పి కారణంగా పరిస్థితి విషమంగా ఉందని తెలియజేసింది. కరోనా నివారణలో భాగంగా దేశమంతటా లాక్‌డౌన్‌ విధించడంతో వాహనరాకపోకలు బంద్‌ అయిన సంగతి తెలిసిందే.