Movies

ఆర్ధ్ర పాత్రల అడ్రస్…సుజాత

Remembering Veteran Actress Sujatha On Her Death Anniversary

కథానాయికగా ఒక తరం ప్రేక్షకులకు… క్యారెక్టర్‌ నటిగా మరో తరం ప్రేక్షకులకు సుపరిచితురాలు సుజాత. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారీమె. సాత్విక పాత్రలకి, ఆర్ద్రతతో కూడిన పాత్రలకి పెట్టింది పేరన్నట్టుగా వెండితెరపై సందడి చేశారు. ఎన్టీఆర్, శివాజీ గణేశన్, కమల్‌హాసన్, రజనీకాంత్, అనంతనాగ్, శ్రీనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌బాబు, కృష్ణ వంటి అగ్ర నటులతో కలిసి నటించారు. సుజాత డిసెంబరు 10, 1952న శ్రీలంకలో జన్మించారు. కేరళకి చెందిన ఈమె తండ్రి ఉద్యోగం రీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో, సుజాత అక్కడే పుట్టి పెరిగారు. తండ్రి పదవీ విరమణ తర్వాత మళ్లీ కేరళకి వచ్చారు. పద్నాలుగేళ్ల వయసులో ‘తబస్విని’ అనే చిత్రంతో తెరకు పరిచయమయ్యారు సుజాత. ఆ చిత్రం తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేశారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ (తెలుగులో అంతులేని కథ)తో నటిగా పేరు తెచ్చుకున్న ఈమె, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘గోరింటాకు’తో తెలుగులో పరిచయమైంది. ఆ చిత్రం విజయవంతం కావడంతో తెలుగులోనూ బిజీ అయ్యారు సుజాత. ‘సంధ్య’, ‘సుజాత’, ‘ఏడంతస్తుల మేడ’, ‘పసుపు పారాణి’, ‘సర్కస్‌ రాముడు’, ‘సూరిగాడు’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘అహంకారి’, ‘జస్టిస్‌ చక్రవర్తి’, ‘సీతాదేవి’, ‘బహుదూరపు బాటసారి’ తదితర చిత్రాలు చేశారు. ‘సూత్రధారులు’, ‘శ్రీరామదాసు’, ‘పెళ్ళి’ చిత్రాలు సుజాతకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘పెళ్ళి’ సినిమాలో నటనకిగానూ ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం అందుకొన్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఇంటి యజమాని అబ్బాయి అయిన జయకర్‌ హెన్రీని ప్రేమించిన ఆమె, పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడి సంప్రదాయాలు నచ్చకపోవడంతో కాన్పుకోసం ఇండియాకి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లలేదు. ఈమెకి కుమారుడు సాజిత్, కుమార్తె దివ్య ఉన్నారు. 58 యేళ్ల వయసులో 2011, ఏప్రిల్‌ 6న… చెన్నైలోని సొంత ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సుజాత గారి వర్ధంతి.