DailyDose

మాస్కులు ఇలా వాడుకోండి-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-How To Reuse Masks

* విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ సస్సెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇలాంటి చర్యతో ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోధైర్యం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్‌ వెల్లడించారని తెలిపారు.

* రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న వేళ రాజకీయ నాయకులు భౌతిక దూరంపాటిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేయాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కోరారు. అనుమతి తీసుకొని మాత్రమే నిత్యావసరాలు పంచాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీల నేతలు, కార్యకర్తలు పలు చోట్ల భౌతికదూరం పాటించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. పోలీసులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లు ఇస్తున్నాం. విజయవాడ నగరంలో భవానీపురం, పాతరాజరాజేశ్వరీపేట, రాణిగారితోట, ఖద్దూస్‌నగర్‌‌, పాయకాపురం, సనత్‌నగర్‌లు రెడ్‌జోన్లుగా ఉన్నాయి. వీటిలోకి ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిలేదు. ఈ రెడ్‌ జోన్లలో మున్సిపల్‌ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తాం’’ అని సీపీ వివరించారు.

* దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌పై పోరుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమగ్ర ప్రణాళికతో ముందుకొచ్చారు. దీనికి ‘షీల్డ్‌’ (షీఏళ్డ్) అని పేరుపెట్టారు. దిల్లీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 21 ప్రాంతాల్లో ‘షీల్డ్‌’ చేపట్టనున్నామని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర ప్రణాళిక గురించి వివరించారు.

* నిర్మల్‌ జిల్లాలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఈ రోజు కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 15కి చేరినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు నిర్ధారణ అయిన కేసుల్లో నర్సాపూర్‌లో 2, భైంసాలో 2, నిర్మల్‌లో 1 చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు.

* కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించనుందని సమాచారం. సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలకు వడ్డీ రాయితీలు, స్థిరాస్తి రంగానికి మినహాయింపులు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పునర్‌ మూలధన సమీకరణకు ప్యాకేజీలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తెలిపింది.

* కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో వైద్యులు మాస్కులు వాడే విధానాన్ని వివరిస్తూ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌(ఎయిమ్స్‌)కొన్ని విధివిధానాలు జారీచేసింది. మాస్కుల కొరత కారణంగా వాటిని తిరిగి వాడాలంటూ వైద్య సిబ్బందిని కోరిన మరుసటి రోజే ఈ సూచనలు చేసింది. ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలంటూ ఎయిమ్స్ గతంలో వారిని కోరింది. ఏ రోజు వాడిన మాస్కుకు ఆ రోజు నంబరు వేసి, ఒక బ్రౌన్‌ బ్యాగ్‌లో భద్రపరిచి, నాలుగు రోజుల తరవాత వాడాలని వాటిలో పేర్కొంది.

* గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని నరసరావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి టీబీ, నెమ్ము చికిత్స కోసం 10 రోజుల క్రితం ఐడీహెచ్‌ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు నరసరావుపేట ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడు మృతి చెందిన అనంతరం పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆర్డీవో వెల్లడించారు.

* నిజామాబాద్‌ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో గురువారం మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 47కి చేరింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ వివరించారు.

* బుల్లితెర నటి విశ్వశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సార్‌నగర్‌ ఇంజినీర్స్‌ కాలనీలో నివాసముంటున్న ఆమె గత నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం ఇచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో ఆమె మృత దేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసులు తెలిపారు.

* విదేశీయులను పోలినట్లుగా ఉన్నారన్న కారణంతో ఇద్దరు మణిపూర్‌ వాసులను సూపర్ మార్కెట్‌లోకి అనుమతించని వనస్థలిపురంలోని ఓ సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూపర్‌ మార్కెట్‌ మేనేజర్‌, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తామిద్దరూ ఆధార్‌కార్డు చూపించినా నిర్వాహకులులోనికి అనుమతించలేదని మణిపూర్‌కు చెందిన జోనా అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ సూపర్‌మార్కెట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

* కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజల ప్రాణాలు.. ఆర్థిక స్థిరత్వం కంటే ముఖ్యమైనవని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

* మీడియాకు ఇచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లలో కరోనాకు సంబంధించిన సమాచారం మినహా మిగతా యాడ్స్‌ను రెండు సంవత్సరాల పాటు నిలిపివేయాలన్న సూచనను వెనక్కి తీసుకోవాలని ది ఇండియన్ న్యూస్‌ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్‌) కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరింది. అది ఆర్థిక సెన్సార్‌షిప్‌కు ఏ మాత్రం తీసిపోదని గురువారం తన ప్రకటనలో పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కరోనా కారణంగా మరింత కాలం లాక్‌డౌన్‌ విధించొచ్చన్న వార్తలతో నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ముగించడం గమనార్హం. కేంద్రం సైతం రెండో ప్యాకేజీకి సిద్ధమవుతోందన్న వార్తలు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 1265.66 పాయింట్లు లాభపడి 31,159.62 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 3563.15 పాయింట్లు లాభపడి 9,111.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.42గా ఉంది.

* కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో వెంటిలేటర్ల కొరతపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్లు ఇచ్చి భారత్ తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న తేడాలను మర్చిపోయి సాయం చేస్తే పాకిస్థాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు.