Editorials

దిక్కుమాలిన చైనా నోటి వెంట అన్నీ అబద్ధాలే

దిక్కుమాలిన చైనా నోటి వెంట అన్నీ అబద్ధాలే

చైనాలో మొదలై ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. ఆ దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇంతటి విపత్తుకు కారణమైన కరోనా వైరస్‌ పుట్టుకకు చైనాయే కారణమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నట్లు ఆ వైరస్‌ను సృష్టించింది చైనాయేనా? మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా, కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్న వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం మీరంటే.. మీరంటూ అమెరికా-చైనా అంతర్జాతీయ వేదికగా వాదించుకుంటున్నాయి. తాజాగా ఫాక్స్‌ న్యూస్‌ బయట పెట్టిన నివేదిక ఏం చెబుతోంది. దానికి ట్రంప్‌ ఏమంటున్నారు? మహమ్మారి కరోనా వైరస్‌ జన్మస్థలం చైనాలోని వుబెయ్‌ ప్రావిన్స్‌ వుహాన్‌ నగరమన్నది అందరికీ తెలిసిందే. చైనాలోని ప్రధాన నగరాల్లో ఇదొకటి. ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార మార్కెట్‌ ఇక్కడుంది. అక్కడి సముద్ర జంతువుల ఆహారం దొరికే చోటే గతేడాది చివర్లో కరోనా వైరస్‌ పుట్టిందని అందరూ అనుకుంటున్నారు. అక్కడి ఆహారాన్ని కొనుగోలు చేసి తిన్న వ్యక్తి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకిందని భావిస్తున్నారు. అయితే, ఫాక్స్‌ న్యూస్‌ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన నివేదిక మరోలా చెబుతోంది. ఈ వైరస్‌కు నిలయమైన గబ్బిలాలపై వుహన్‌ లేబొరేటరీలో పరిశోధన చేస్తుండగా, తొలుత అక్కడ పనిచేసే వ్యక్తికి సోకడం ద్వారా వ్యాపించిందట. ‘పేషెంట్‌ జీరో’ అక్కడ పనిచేస్తుండటం, ఆమె నుంచి ఈ దావానలం సామాజ్య ప్రజలకు వ్యాపించిందని చెబుతోంది. అంతేకానీ, ఇది జీవాయుధం కాదని వెల్లడించింది. వుహాన్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేసిందని, మార్కెట్‌ ద్వారా వ్యాపించినట్లు చెప్పుకొచ్చిందని ఫాక్స్‌ తెలిపింది. దీనిపై తాజాగా శ్వేతసౌథంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫాక్స్‌ న్యూస్‌ విలేకరి ట్రంప్‌తో మాట్లాడుతూ.. ‘‘ఫాక్స్‌ న్యూస్‌కు వివిధ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. కరోనా వైరస్‌ సహజంగానే కొన్ని జంతువుల్లో ఉంటుంది. అయితే, అది పుట్టింది మాత్రం వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే. సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఈ వ్యాధి సోకింది. ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ను కలవడం, అతను మార్కెట్‌కు వెళ్లడం అక్కడి నుంచి వ్యాధి ఇతరులకు వ్యాపించడం ద్వారా మహమ్మారిలా మారింది’’ దీనిపై మీరేంటారు? అని అడగ్గా, ఈ నివేదికను ట్రంప్‌ నిజమైనదేనని చెప్పలేదు.. అలాగని ఖండించలేదు. ‘మరిన్ని కథనాలు మనం వింటాం. చూస్తాం. ప్రస్తుత పరిస్థితిపై మరింత శూలశోధన చేస్తున్నాం’’ అని మాత్రం సమాధానం ఇచ్చారు. ఇక ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చైనీస్‌ ల్యాబ్‌ భద్రతపై ఫోన్‌లో మాట్లాడారట? అని అదే విలేకరి ప్రశ్నించగా, ‘లేబొరేటరీ గురించి నేను ఏం మాట్లాడానో చర్చించదలచుకోలేదు. ఇది అప్రస్తుతం’ అని సమాధానం ఇచ్చారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై పరిశోధన చేస్తున్న వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో భద్రత ప్రమాణాలపై రెండేళ్ల కిందటే యూఎస్‌ ఎంబసీ హెచ్చరించిందని ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. వుహాన్‌లోని ఈ ల్యాబ్‌ మాంసాహార విక్రయ మార్కెట్‌కు అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం.