Sports

క్రికెటర్లకు వలవేస్తున్న బెట్టింగ్ బుకీలు

Bookies Targetting Cricketers For Betting-Says ICC

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాయతీయ, దేశవాళీ స్థాయిలో క్రికెట్‌ టోర్నీలు జరగట్లేదు. క్రికెటర్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే బుకీలు ఇదే అదనుగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం క్రికెటర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. ‘‘గతంలో కంటే ఎక్కువసేపు సామాజిక మాధ్యమాల్లో ఉంటున్న క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారు. వారితో మాట్లాడటానికి, బంధాన్ని పెంచుకోవడానికి యత్నిస్తున్నారు. భవిష్యత్తులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు వినియోగించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు. కొవిడ్‌-19తో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నిలిచిపోయినా అవినీతిపరులు (బుకీలు) మాత్రం చురుకుగా ఉన్నారు. అయితే ప్రమాదకరమైన పరిస్థితుల గురించి ఆటగాళ్లకు అవగాహన ఉంది’’ అని మార్షల్ వెల్లడించారు. సంక్షోభం నుంచి సాధారణ పరిస్థితులకు చేరుకుని మ్యాచ్‌లు ఎప్పుడు ఆరంభమవుతాయనే దానిపై స్పష్టత లేదని అన్నారు. దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ స్పందించాడు. భారత ఆటగాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని, ఒకవేళ బుకీలు ఎవరైనా సంప్రదిస్తే వెంటనే తమకి తెలియజేయాలని క్రికెటర్లకు సూచించారు. అభిమానిలా బుకీలు సంభాషణ ప్రారంభించి, అవినీతి గురించి చర్చిస్తారని తెలిపారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి కూడా బుకీల విషయంపై స్పందిస్తూ.. తమ ఆటగాళ్లపై నమ్మకం ఉందని, అవినీతిపరుల ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు.