Politics

సడలింపుల ముచ్చట లేదు. మే7 దాంకా అన్నీ బంద్.

KCR Announces Telangana Action Plan-KCR Announces Telangana Action Plan-All Closed In Telangana Until May 7th-Telangana Cabinet Meeting 2020 April

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ 18 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క కరోనా కేసు కూడా లేని జిల్లాలు రాష్ట్రంలో 4 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2.44 శాతంగా ఉందని, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8 రోజులకు రెట్టింపవుతోందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య సిబ్బందికి అవసరమయ్యే పరికరాల కొరతను అధిగమించామన్నారు. తెలంగాణలో ఏప్రిల్‌ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.మే 5న మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.రేపట్నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని చెప్పారు. రంజాన్‌ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.కంటైన్‌మెంట్‌ జోన్లను బాగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన వేతనాలనే ఏప్రిల్‌ నెలలోనూ ఇస్తామన్నారు. గతంలో పెన్షనర్లకు ఇచ్చిన 50 శాతం వేతనాన్ని 75 శాతానికి పెంచామన్నారు.‘‘ సీఎం ప్రోత్సాహకం కింద పోలీసులకు గ్రాస్‌ వేతనంలో 10 శాతం ఎక్కువగా చెల్లిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థలు ట్యూషన్‌ ఫీజు తప్ప.. అదనపు ఫీజులేవీ తీసుకోవద్దు. నెలవారీగా మాత్రమే వసూలు చేయాలి.. విద్యాసంవత్సరం ఫీజంతా ఓకే సారి కట్టాలని ఒత్తిడి చేయకూడదు. ఒక వేళ అలా చేస్తే 100కి డయల్‌ చేసి ఫిర్యాదు చేయండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.