Movies

సంగీత స్వరప్రభంజనం…ఎస్.జానకి-TNI కథనం

సంగీత స్వరప్రభంజనం…ఎస్.జానకి-TNI కథనం

‘‘కోకిలమ్మ బడాయి చాలించుమా.. సుశీల, జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా..’’ అంటూ ఓ కవీంద్రుడు ఇద్దరు గాన సరస్వతుల గొప్పతనానికి అందమైన బాణీ కడితే అది ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించింది. నిజమే ఆ కవీంద్రుడు బాణీలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. సుశీల, జానకిలిద్దరూ దశాబ్దాలుగా అమృతమంటి గానామృతంతో సినీ, సంగీత ప్రియులను ఓలలాడిస్తున్నవారే. అఖండ సంగీత సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాణుల్లా ఏలుతున్నవారే. వీరిలో ముఖ్యంగా ఎస్‌. జానకి స్వరం మరింత ప్రత్యేకం. ఆ సంగీత రాజ్ఞి స్వర ప్రభంజనం అనన్యసామాన్యం. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుంది. అమ్మఒడిలో తలవాల్చిన పసిపాపల్లే హాయిగా నిద్రలోకి జారిపోతుంది. వాన చుక్క కురవకుండానే నెమలి సైతం పరవశంతో నాట్యమాడేస్తుంది. విరిగి నలిగిన కల్లోలిత హృదయాలను ప్రశాంతమైన స్వర్గసీమలోకి తీసుకెళ్తుంది. అదీ జానకమ్మ పాటలోని గొప్పదనం. ఏప్రిల్‌ 23 ఈ గానసరస్వతి పుట్టినరోజు.

‘‘జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా..’’ జానకమ్మ గురించి ఇళయరాజా ఓ తమిళ పత్రికలో చెప్పిన మాటలివి. నిజమే ఆమె పాటలు వింటూంటే ఎవరికైనా రాజా చెప్పినది అక్షరసత్యమనిపిస్తుంది. అది ఆమె స్వరమాధుర్యంలో ఉన్న మహిమ. ఆమె పాటలతో ఆడే ఆటలు ఎన్నో సందర్భాల్లో సినీ, సంగీత ప్రియులను ఆనందాశ్చర్యాలకు గురిచేశాయి.. పాటలతో మిమిక్రి చేసి చూపిన అరుదైన సంగీత సరస్వతి జానకమ్మ. ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో ‘‘కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే..’’ పాటలో పండు ముసలావిడగా.. ‘స్వాతి ముత్యం’లో ‘‘చిన్నారి పొన్నారి కిట్టయ్యా..’’ అంటూ చిన్నారి గొంతు.. ‘శ్రీవారి శోభనం’లో ‘‘అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక..’’ పాటలో బామ్మగా విభిన్నరకాల గొంతులతో గీతాలు ఆలపించి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేక స్వరం అని నిరూపించుకుంది. ఆమె ఐదు దశాబ్దాలకు పైగా సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50,000 పైగా గీతాలు ఆలపించారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల్లో ఉత్తమగాయనిగా 31 సార్లు అవార్డులు అందుకున్నారు ఎస్‌.జానకి.

ఎస్‌.జానకి పూర్తిపేరు శిష్ఠా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్‌ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లెకు సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించింది. జానకికి బాల్యం నుంచి సంగీతంపై మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే చిన్నతనంలోనే ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో ఆరితేరింది. నాదస్వరం విద్వాన్‌ పైడిస్వామి వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకుంది. మూడవ ఏట నుంచే అనేక పాటల కచేరీల్లో పాల్గొన్న జానకి, తన కార్యక్రమాల్లో ఎక్కువగా పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలను పాడుతుండేది. అలా చిన్నతనంలోనే తనదైన సంగీత ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించింది జానకి. తర్వాత కొన్నాళ్లకు తన మామయ్య సలహాతో 19ఏళ్ల వయసులో మద్రాసుకు చేరుకొని సినీ రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధపడింది.

జానకమ్మ మద్రాసుకు వెళ్లిన తొలినాళ్లలో ఏవీఎం స్టూడియోలో గాయనిగా ఉండేది. అక్కడ చిన్నచిన్న ఆల్బమ్స్‌ చేస్తూనే తన ప్రతిభను మరింత సానబెట్టుకుంది. ఆ సమయంలోనే జానకిలోని స్వర ప్రతిభను చూసి సంగీత దర్శకులు టి.చలపతిరావు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విధియిన్‌ విలాయత్తు’లో పాట పాడే అవకాశాన్నిచ్చారు. ఇందులో జానకమ్మ, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి తొలిసారి తన గొంతును వినిపించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. దాని తర్వాత ‘ఎం.ఎల్‌.ఏ’ (1957) చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘‘నీ ఆశ అడియాస..’’ పాట పాడారు. ఇది ఆమె పాడిన తొలి తెలుగు సినీ గీతం. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. అక్కడి నుంచి మొదలైన ఆమె గాన మాధుర్యం సెలయేరులా సాగుతూ, ఎన్నో మలుపులు తిరుగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది.

జానకి సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టిన తొలినాళ్లలో దాదాపుగా ఎక్కువ విషాద గీతాలనే ఆలపించింది. వాటితోనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హుషారైన పాటలతోనూ అలరించింది. ఓవైపు నేపథ్య గాయనిగా రాణిస్తూనే కొన్ని చిత్రాలకు సంగీత దర్శకురాలిగానూ పనిచేసి మెప్పించింది జానకమ్మ. ఆమె తొలిసారి ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘మౌన పోరాటం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది.

విషాదమైనా, ఆనందమైనా, ప్రేమ భావనైనా ఎలాంటి భావాలనైనా జానకి తన గొంతుతో అద్భుతంగా పలికించి చూపిస్తుంది. దానికి భాషా, ప్రాంతీయ భేదాలుండవు. ఆమె ఆలపించిన గీతాల్లో ‘‘మేఘమా దేహమా..’’ పాటలో ఆమె స్వరంలో పలికిన ఆర్ద్రత.. ‘‘ఆకాశం ఏనాటిదో.. ఆనందం ఆనాటిది..’’ అని సాగే గీతంలో ఆమె హృదయం నుంచి ఉప్పొంగిన ప్రేమ తత్వం.. ‘‘వెన్నెల్లో గోదావరి అందం..’’ పాటలో పలికించిన ఆవేదన.. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది..’’ పాటలో కనబర్చిన అల్లరి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.