DailyDose

మ్యూచువల్ ఫండ్ పథకాలకు స్వస్తి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Franklin Templeton Closes Mutual Funds

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ‌ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సంస్థ అందిస్తోన్న ఆరు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బాండ్‌ మార్కెట్లలో ద్రవ్య లభ్యత భారీగా తగ్గిపోవడం, పథకం నుంచి ఉపసంహరణకు మదుపర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా కష్టాల నేపథ్యంలో ఓ సంస్థ ఇలా డెట్‌ పథకాల్ని నిలిపివేయడం ఇదే తొలిసారి. రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో మదుపర్లకు మెరుగైన రిటర్నులను అందించాలంటే ఇంతకంటే మేలైన మార్గం లేదని సంస్థ వివరించింది.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో వరుసగా రెండు రోజులు లాభాల్లో కొనసాగిన సూచీలకు బ్రేక్‌ పడింది. ఉదయం 9:42 గంటల సమయంలో సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 31,397 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 9,183 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద రూ.75.29 కొనసాగుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకాలను మదుపర్లు క్షుణ్నంగా అధ్యయనం చేసే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో నేడు మార్కెట్లు కాస్త ఊగిసలాటకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా మార్కెట్లు గురువారం కుంగుబాటులోనే ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో నమోదవుతున్నాయి. వైరస్‌కు సంబంధించిన ఔషధాల తయారీ పురోగతిలో నెలకొన్న అనుమానాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో కుంగిపోయిందన్న తాజా నివేదికలు మదుపర్లను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సూచీలు కింది స్థాయిలో కదలాడుతున్నాయి.

* చైనా సంస్థలు పెట్టుబడి పెట్టిన భారత అంకురాల్లో కొన్ని ఆచరిస్తున్న వ్యూహాలు, దేశీయ కంపెనీల ప్రయోజనాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయని, ఇటువంటి సంస్థల కార్యకలాపాల తీరుపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మేధో సంస్థగా పేర్కొనే గేట్‌వే హౌస్‌ సూచించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కొవిడ్‌-19తో బలహీనపడ్డ భారత కంపెనీలు ‘అవకాశవద్ద టేకోవర్ల’కు గురికాకుండా భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో గేట్‌వే హౌస్‌ ప్రతినిధి వెబ్‌నార్‌లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. ‘చైనాకు చెందిన హువావే, అలీబాబా లాంటి దిగ్గజాలు భారత్‌లో పెట్టిన పెట్టుబడులపై కొన్నాళ్లపాటు నష్టాలు భరించేందుకు సిద్ధమవుతున్నాయి. లాభాపేక్ష కంటే కూడా డబ్బులు పోగొట్టుకునేందుకే భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఉంద’ని ఇక్కడి జరిగిన ఓ వెబినార్‌లో అమిత్‌ భండారి అనే ఓ వక్త అన్నారు. చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్‌లైన్‌లో ట్యాక్సీ సేవల సంస్థ ఓలా, హోటల్‌ సేవల సంస్థ ఓయోలు.. నష్టాలను చవిచూస్తూ కూడా, దేశీయంగా ధరల నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నాయని అన్నారు. ‘ఇటువంటి కొన్ని కంపెనీల వ్యవహారంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అవసరానికి మించి పెట్టుబడులు అందించడం ద్వారా ఇవి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు పేటీఎం, ఓయో, ఓలా రూ.వేల కోట్లల్లో నష్టాలను చవిచూస్తున్నాయి. తద్వారా ధరల నిర్ణయాత్మక శక్తిని తమ చేతుల్లో ఉంచుకుంటున్నాయ’ని తెలిపారు. ‘ఈ కంపెనీలకు లాభాలతో పనిలేదు. లాభాలు ఆర్జించాలని కూడా ఇక్కడకు రాలేదు. కానీ దేశీయ సంస్థలకు మాత్రం ఇందువల్ల నష్టం వాటిల్లుతోంది లేదా మనలేక పోతున్నాయి. అందువల్ల ఇవి పెట్టే పెట్టుబడులపై నిఘా అవసరమ’ని భండారి అభిప్రాయపడ్డారు. చైనా పెట్టుబడిదార్లు అండగా ఉన్న కంపెనీలు ఇష్టానుసారం నిధులను వెచ్చిస్తుండటం వల్ల ఇతర కంపెనీల ప్రయోజనాలకు ముప్పు ఏర్పడిందని తెలిపారు.

* బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్యలభ్యతను పెంచే ఉద్దేశంతో ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన టార్గెటెడ్‌ లాంగ్‌ టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ (టీఎల్‌టీఆర్‌ఓ 2.0) తొలి విడత వేలానికి బ్యాంకుల నుంచి నామమాత్ర స్పందన లభించింది. మూడేళ్ల కాలపరిమితితో రూ.25000 కోట్లకు వేలం నిర్వహించగా.. సుమారు 50 శాతానికే అంటే రూ.12,850 కోట్లకు మాత్రమే బిడ్‌లు దాఖలయ్యాయి. గురువారం నిర్వహించిన వేలంలో 14 బిడ్‌లు దాఖలు అయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. వేలానికి పేలవ స్పందన రావడంతో, ఈ విధానంపై సమీక్ష నిర్వహిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. సెక్యూరిటీలు జారీ చేసే సంస్థల ఆర్థిక పటిష్ఠతపై బ్యాంకులకు పూర్తి స్థాయిలో విశ్వాసం లేకపోవడం ఈ వేలానికి పెద్దగా స్పందన రాకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బ్యాంకులు ఈ నిధులను పెట్టుబడిగా పెట్టే ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐల నుంచి మంచి రేటింగ్‌ ఉన్న డెట్‌ సెక్యూరిటీలు లేకపోవడమూ మరో కారణం. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), సూక్ష్మ రుణ సంస్థలకు నిధుల సహకారం అందించే ఉద్దేశంతో రూ.50,000 కోట్లకు టీఎల్‌టీఆర్‌ఓ 2.0ను రెండు దశల్లో నిర్వహిస్తామని ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు ఎల్‌టీఆర్‌ఓ విధానాన్ని మార్చిలో ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. ఈ విధానంలో బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను పూచీకత్తుగా పెట్టి ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితికి రెపో రేటుతో ఆర్‌బీఐ నుంచి నిధులను పొందుతాయి. ఈ నిధులను ఎన్‌బీఎఫ్‌సీలకు, సూక్ష్మ రుణ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు ఉపయోగిస్తాయి.

* కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు ఈ నిబంధనను అలవాటుగా మార్చుకుంటున్నారు. తాజాగా సామాజిక దూరం ప్రాముఖ్యతను ఉదహరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వాల ప్రచారాన్ని తలకెక్కించున్న ఓ ఎలక్ట్రిక్‌ ఆటోడ్రైవర్‌ తన బాధ్యతగా చేసిన పని మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఆటోడ్రైవర్‌ ఏం చేశాడంటే…. తన ఆటోలో ప్రయాణించే వారి మధ్య సామాజిక దూరం ఉండే విధంగా ఆటోను నాలుగు భాగాలుగా విభజించాడు. అందులో ప్రయాణికులకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా మధ్యలో అడ్డుగా ఇనుప ఫ్రేములతో పరదాలను ఏర్పాటు చేశాడు. దీని వల్ల ప్రయాణికుల మధ్య సామాజిక దూరం ఉండటమే కాకుండా, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయింది.