Kids

పిల్లలు ఆన్‌లైన్ అశ్లీల ఉచ్చులో పడుతున్నారేమో గమనించండి

Kids And Online Classes Might Not Go Well-Keep An Eye

‘మా వాడు ఫోన్లో తరచూ అశ్లీల వెబ్‌సైట్లను తెరిచి చూస్తున్నాడు. నాకు భయంగా ఉంది. ఏం చేయాలో అర్థంకావడంలేదు’.. కౌన్సెలింగ్‌ సెంటర్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి తండ్రి ఆందోళన ఇది.. ‘పబ్‌జీ, వీడియో గేమ్‌లు అంటూ నా కొడుకు ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్‌లోనే ముఖం పెడుతున్నాడు. వద్దంటే ఏమైనా చేసుకుంటాడేమోనని ఆందోళనగా ఉన్నది. ఫోన్‌ చూడటం తగ్గించేలా ఏవైనా మందులివ్వండి’ ఓ డాక్టర్‌కు పదోతరగతి విద్యార్థి తల్లి ఫోన్‌ద్వారా చేసిన విజ్ఞప్తి ఇది.. నిత్యం తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధన జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఎన్నో కేసులు నమోదయ్యాయి.. మరి కరోనా లాక్‌డౌన్‌.. విద్యా విధానంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది.

ఆన్‌లైన్‌ పాఠాలతో సాంకేతికత వినియోగాన్ని పెంచింది. ఈ క్రమంలో జూమ్‌, గూగుల్‌ టీచర్‌ వంటి రకరకాల యాప్‌లతో ఆన్‌లైన్‌ పాఠాలు స్మార్ట్‌ఫోన్ల రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా విద్యార్థులకు ముప్పు పొంచి ఉన్నదని మేధావులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు అశ్లీల సైట్లు ఓపెన్‌ కాకుండా సాప్ట్‌వేర్‌ సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలు అవసరమే అయినా.. ఆ పేరుతో విద్యార్థులు పక్కదారి పట్టకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని చెప్తున్నారు. ప్రభుత్వాలు పనికిరాని సైట్లను కట్టడిచేయాలని సూచిస్తున్నారు. ప్రాథమిక విద్య మొదలు.. పదో తరగతి, ఇంటర్‌, యూజీ, పీజీ వంటి సాంప్రదాయక కోర్సులతోపాటు ప్రవేశ పరీక్షలకు, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తివిద్యలవారీగా ఆన్‌లైన్‌ టీచింగ్‌ తప్పనిసరైంది. విద్యార్థి లోకం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల వాడకంలో నిమగ్నమైంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ పాఠాల కోసం స్మార్ట్‌ఫోన్లను వినియోగించే యువత 80 శాతానికిపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు అందించడానికి భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, నిపుణులు కోరుతున్నారు.

*** ‘స్వయం’ మాదిరి చర్యలతో మేలు
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వయం యాప్‌ (మూక్స్‌ కోర్సుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది)కు అన్నిరకాల భద్రతాచర్యలు తీసుకున్నామని సీనియర్‌ ప్రొఫెసర్లు చెప్పారు. ముఖ్యంగా అశ్లీల, వీడియో గేమ్‌లు, మైండ్‌గేమ్‌లకు అవకాశం లేకుండా సర్వర్లను బ్లాక్‌ చేశారు. దీనివల్ల యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన స్వయం వెబ్‌సైట్‌ కేవలం పాఠాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తెచ్చే ప్రైవేటు విద్యాసంస్థలు ఇలాంటి చర్యలే చేపట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

*** సర్వర్లను నియంత్రించాలి
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ప్రపంచ దేశాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు, పరీక్షలు, మూల్యాంకనం చేస్తున్నా యి. ఆన్‌లైన్‌ ద్వారా కొంతవరకు చెడు ప్రభావం ఉన్నప్పటికీ.. 80 శాతం వరకు మంచి ఫలితాలే నమోదవుతున్నాయి. ఎవరైతే ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు బోధించడానికి ముందుకొస్తున్నారో.. అందుకు సంబంధించిన సర్వర్లను బ్లాక్‌ చేయాలి. దీనివల్ల కొంత ఫలితం ఉంటుంది.

*** తల్లిదండ్రులదే కీలకపాత్ర
ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు స్వీకరించాల్సిందే. ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో పది, ఇంటర్‌ విద్యార్థులు ఇతర వెబ్‌సైట్ల వెళ్తూ పక్కదారులు పడుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుంచి నాకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. కొంతమంది మందులు ఇవ్వాలని అడుగుతున్నారు. విద్యార్థులు చేతికి ఫోన్లు ఇవ్వడం, పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణం. తల్లిదండ్రుల నిరక్షరాస్యతా ఓ కారణమే.

*** స్మార్ట్‌ఫోను ఇవ్వొద్దు
ప్రస్తుతం ఎంసెట్‌, జేఈఈ-మెయిన్‌, నీట్‌, ఇతర పాఠాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. భవిష్యత్తు ఇలాగే ఉంటుంది. క్లాస్‌ రూంకు వచ్చినా ప్రిపరేషన్‌ కోసం స్మార్ట్‌ఫోన్లు అనివార్యమయ్యాయి. గూగుల్‌ ఓపెన్‌చేస్తే అనేక లింకులు వస్తాయి. విద్యార్థులకు పాఠాలపై కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. స్మార్ట్‌ఫోన్ల ఉపయోగంపై అవగాహన కల్పించాలి. ఒంటరిగా ఉంటే విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వొద్దు.