Health

కట్ల తీగ పసరుతో కరోనా మందు

New leaf juice as medicine for COVID19

కరోనా చికిత్సలో వైద్యరంగం ఏ రాయినీ వదలడం లేదు. అవకాశమున్న ప్రతి చికిత్సా విధానం గురించి ఆలోచిస్తున్నారు. తాజాగా ఓ చెట్లమందు ముందుకు వచ్చింది. కాక్యులస్ హిర్సూటస్ అనేది ఉష్ణమండలంలో పెరిగే ఓ తీగజాతి మొక్క. భారత, పాకిస్థాన్ దేశాలతోపాటు ఆఫ్రికాలో ఇది బాగా పెరుగుతుంది. తెలుగులో దీనిని చీపురు తీగ, దూసరి తీగ, కట్ల తీగ అంటారు. 2-3 మీటర్ల ఎత్తువరకు ఇది చెట్లకు పారుతుంది. దట్టంగా పొదలలా కనిపిస్తుంది. దీని పండ్లు ముదురు వంకాయ రంగులో 4-8 మిల్లీ మీటర్ల వ్యాసంతో ఉంటాయి. ఈ చెట్లమందును మన దేశంలోని ఆదివాసీ తెగలు ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నాయి. ఇటీవల డెంగ్యూ చికిత్స కోసం ఈ చెట్టు నుంచి మందును తయారుచేసి పరిశోధనా సంస్థలు పరీక్షలు జరుపుతున్నాయి. కరోనాకు కూడా ఇది పనిచేస్తుందేమోననే ఆలోచన రావడంతో పరీక్షల నిమిత్తం డ్రగ్ కంట్రోలర్ ఆప్ ఇండియా అనుమతికి దరఖాస్తు పంపారు. పరిశోధనా సంస్థలతో కలిసి సన్ పార్మా ఈ మందును తయారు చేస్తున్నది. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు 50 మంది ఎంపిక చేసిన రోగులపై పరిమిత స్థాయిలో పరీక్షలు జరపాలని భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) భావిస్తున్నది. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధిపై జరిపిన తొలి పరీక్షల్లో ఈ మందు ప్రభావం బాగానే ఉన్నట్టు తెలిసింది. కోవిడ్-19 వంటి ఆర్ఎన్ఏ వైరస్‌లపై కూడా ఇది బాగానే పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు ఈ ప్రయోగాల్లో కీలక భాగస్వామి అయిన జమ్ముకశ్మీర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రామ్ విశ్వకర్మ చెప్పారు. డెంగ్యూ, కరోనా వైరస్ రెండూ వేరువేరు మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కానీ ప్రవేశించిన తర్వాత శరీరంలో వాటి ఎదుగుదల ఒకేతీరుగా ఉంటుందని డాక్టర్ విశ్వకర్మ తెలిపారు. డెంగ్యూ, చికున్‌గున్యా, ఎన్సెఫాలిటిస్ వ్యాధుల్లో ఈ మందు ప్రభావం చూపిందని చెప్పారు. కరోనా వైరస్‌పై ప్రభావం చూపినట్టు తేలితే ప్రపంచం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇది కరోనాకు పనిచేసే చెట్లమందే కాదు.. స్వదేశీ మందు కూడా అవుతుంది.