Health

అమ్మ ఆరోగ్యమే బిడ్డకు ఆనందం

Pregnant Ladies Health Matters To New Born

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. గర్భం ధరించిన నాటి నుంచి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తొలిసారిగా గర్భం ధరించిన యువతికి తాను ఏ ఆహారం తినవచ్చో, ఏవి తినకూడదో, తన ఆరోగ్యం, గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సరైన అవగాహన అవసరం. తల్లి తీసుకునే ఆహారం మీదే గర్భస్థ శిశువు శారీరక, మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మామూలుగా తీసుకునే ఆహారం కంటే గర్భం ధరించిన సమయంలో.. మూడు వందల కేలరీలు అద నంగా లభించేలా ఆహారాన్ని తీసు కోవాలి. ఆహారం స్వల్పంగా తీసుకున్నా, కేలరీలు అధికంగా లభించే ఆహార పదా ర్థాలు తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.్రతిరోజూ శరీరానికి అందించే కాల్షియం కంటే, గర్భవతిగా ఉన్నప్పుడు, పాపాయి పాలు తాగుతు న్నప్పుడు మరింత కాల్షియం అదనంగా కావలసి ఉంటుంది. తల్లి అందించే కాల్షియం గర్భస్థ శిశువు ఎముకల నిర్మాణానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంది. అదేవిధంగా ఐరన్‌ అధికంగా కావలసి ఉంటుంది. ప్రతిరోజూ ఒక ఆకుకూరను తీసుకోవడం మంచిది. మలబద్ధకం ఏర్పడకుండా పీచుపదార్థాలు తీసుకోవాలి. పండ్ల రసాలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసులు తక్కువ కాకుండా నీటిని తాగాలి. గర్భవతికి ఫోలిక్‌ ఆసిడ్‌ కూడా అవసరముంటుంది. ఉదయం, సాయంత్రం కొంతసేపు సూర్యరశ్మి శరీరానికి సోకేలా చూసుకుంటే, డి విటమిన్‌ లోపం ఏర్పడదు. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు, అధికంగా మసాలాతో చేసిన పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ లాంటివి తినకపోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా, ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. కొంతమంది గర్భిణులకు మొదటి నెలల్లో వాంతులవుతుంటాయి. అటువంటివారు వాంతులవుతాయేమో అనే భయంతో ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. కాబోయే తల్లులు తమ శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. పరిశుభ్రతను పాటించాలి. రోజూ రెండు పూటలా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా స్నానం చేయాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే ఆ మందులు వేసుకోకూడదు. అలాగే గర్భం ధరించిన సమయంలో విశ్రాంతి అవసరమని, ఏ పనీ చేయకూడదనే భావన మంచిది కాదు. బరువులు ఎత్తకుండా, తేలికపాటి పనులు చేయడం గర్భిణుల ఆరోగ్యానికి మంచిది. కండరాలకు కదలిక ఉండాలి. పనులు చేసుకుంటూ, విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అలసట ఏర్పడదు.
స్త్రీ తల్లి కావాలని తలచినప్పటి నుండే ఆరోగ్యానికి సంబంధించి నియమ నిబంధనలను పాటిస్తే ఆరోగ్యంతో పాటు పండంటి బిడ్డను కనవచ్చు. గర్భం నిర్ధారించాక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మంచి పుస్తకాలను చదవటం ద్వారా ఒత్తిడి నుంచి బయట పడొచ్చు. ఆహారం విషయానికి వస్తే- బాగా ఉడకని మాంసాహారం తినకూడదు. అలాగే పరిశుభ్రంగా కడగని పండ్లు, ఆకు కూరలు, ఇతర ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిదికాదు. ఇవి పుట్టే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాగే తల్లి కాబోయే మీ మనసు ఎప్పుడూ ఆనందంగా, ఆహ్లాద కరంగా ఉండాలి. ఇతర సమస్యల్ని దరికి రానీయకూడదు.