NRI-NRT

కొత్త H1Bలు లేనట్లే!

There will be no H1Bs issuance this year

అమెరికాలో నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో ఒక్కసారిగా 14.7 శాతానికి ఎగబాకిన వేళ..అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం. హెచ్‌-1బీ వంటి పనిఆధారిత కొత్త వీసాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పని చేసుకోవడానికి అనుమతి ఉండే విద్యార్థి వీసాలను సైతం నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు అక్కడి మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.‘‘ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ సలహాదారులు ఓ కొత్త ఆదేశానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని ప్రకారం కొత్త పనిఆధారిత వీసాల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హెచ్‌-1బీ, హెచ్‌-2బీ, పని చేసుకోవడానికి అనుమతి ఉండే విద్యార్థి వీసాలపై ఈ ప్రభావం ఉండనుంది. అసలు ఈ ఆదేశాలు జారీ చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పలేము. అయితే, నిరుద్యోగులుగా మారిన అమెరికన్లకు అవకాశాలు కల్పించడం కోసం వీసాలను రద్దు చేయడం దగ్గరి నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పించడం వరకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌ పాలకవర్గంలోని అధికారుల ద్వారా తెలుస్తోంది’’ అని ప్రముఖ పత్రిక ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’’ పేర్కొంది.అమెరికాలో కొవిడ్‌-19 దెబ్బకు ఒక్క నెలలోనే 2 కోట్ల మందికిపైగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. 11 ఏళ్ల కిందటి ఆర్థిక మాంద్యం తర్వాత సాధించిన ఉద్యోగవృద్ధి అంతా ఒక్క నెలలోనే ఆవిరైపోయిందని ఫ్యాక్ట్‌చెక్‌ సర్వే పేర్కొంది. వీరికి తోడు మరో 50 లక్షల మంది ఉద్యోగుల పని గంటలను సంస్థలు గణనీయంగా తగ్గించేశాయి. నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 3.3 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండో త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు -15 నుంచి -20 మధ్య నమోదుకావొచ్చని శేతసౌధం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం దక్కే దిశగా ట్రంప్‌ పాలకవర్గం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.