Agriculture

అందరూ ఒకే పంట వేయకండి

Do not use the same crop across the entire state-KCR requests farmers

రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణలో పంటలసాగు, ప్రత్యామ్నాయ విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటలకు మంచి ధరలు వచ్చేలా చేయడం అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేటట్లు చేయాలని సీఎం భావిస్తున్నారు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేకసార్లు ముఖ్యమంత్రి చర్చించారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? తదితర అంశాలపై అధ్యయనం జరిగింది. ఈ సమావేశానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్‌.. నేరుగా జిల్లా, మండల వ్యవసాయాధికారులతో కూడా చర్చించాలని ఆదివారం నాటి సమీక్షలో నిర్ణయించారు. ఈ సమావేశం తేదీలు త్వరలోనే ఖరారుచేస్తారు.