Agriculture

“పసుపు” రైతుల కోసం చినబాబు లేఖ

Nara Lokesh Tweets To Support Turmeric Farmers To YSJ

రాష్ట్రంలో పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 33 వేల ఎకరాల్లో పసుపును సాగు చేయగా.. 8.25లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తోందని అంచనా వేసినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వం క్వింటా పసుపుకు రూ.6,850 గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు ఆ ధర లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో క్వింటా రూ.15వేలు ఉంటేకానీ పసుపుకు గిట్టుబాటు కాదని చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని లోకేశ్‌ నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పసుపుకు కనీసం రూ.10వేలు మద్దతు ధర ఉంటే కానీ రైతులకు గిట్టుబాటు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. మరోవైపు అప్పుల భారం వారిని మరింత కుంగదీస్తోందని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.