Politics

కరోనా నిబంధనలు కొనసాగించండి

KCR Orders Administration To Continue LockDown Restrictions

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు కొనసాగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏసీల విక్రయ దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్‌ షోరూంలు, ఆటో మొబైల్‌ విడిభాగాల అమ్మకపు దుకాణాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ‘‘ కరోనా వైరస్‌ హైదరాబాద్‌లోని 4 జోన్లకే పరిమితమయింది. ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, కార్వాన్‌ జోన్లలోనే ప్రస్తుతం యాక్టివ్‌ కేసులున్నాయి. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వలస కూలీలు కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులున్న 4 కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నాం. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా సోకినప్పటికీ కోలుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి శాతం కేవలం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ’’ అని కేసీఆర్‌ అన్నారు.