Editorials

చైనా గూబ పగిలే కార్యాచరణకు అమెరికా శ్రీకారం

USA working diligently on China banning policy

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్‌-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్‌ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది. అవసరమైతే పూర్తి సంబంధాల్ని తెగదెంపులు చేసుకోవడానికీ వెనకాడబోమని హెచ్చరిస్తోంది. తాజా సంక్షోభానికి చైనాయే బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు 18 అంశాలతో కూడిన ఓ కార్యాచరణను ఆవిష్కరించింది. భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలన్న ప్రతిపాదనను సైతం దీనిలో చేర్చడం గమనార్హం. ‘‘చైనా దురుద్దేశపూర్వకంగానే వైరస్‌ ప్రమాదాన్ని కప్పిపుచ్చింది. దీనివల్ల యావత్తు ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా సాంకేతికతను దొంగిలించి ఉద్యోగాలు కొల్లగొట్టి మా మిత్రదేశాల సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోంది’’ అని కార్యాచరణ ఆవిష్కరణ సందర్భంగా సెనెటర్‌ థామ్‌ టిల్లిస్‌ అన్నారు.

కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు..

> ‘పసిఫిక్‌ డిటెరెన్స్‌ ఇనిషియేటివ్‌’ను ప్రారంభించి.. 20 బిలియన్‌ డాలర్ల నిధుల సైనిక విభాగం ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలి.

> స్థానిక మిత్రపక్షాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలి. అందులో భాగంగా ఇండియా, తైవాన్‌, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరించాలి.

> జపాన్‌ సైనిక వ్యవస్థ పునర్‌నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలి. అలాగే దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయించాలి.

> చైనాలో కేంద్రీకృతమైన అమెరికా ఉత్పత్తిని తిరిగి స్వదేశానికి రప్పించాలి. తద్వారా సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. అమెరికా సాంకేతికతను చైనా తస్కరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా హ్యాకింగ్‌, సైబర్‌ మోసాలను అడ్డుకునే వ్యవస్థల్ని బలోపేతం చేయాలి.

> హువావేపై విధించిన నిషేధాన్ని అమలు చేయాలి. మిత్రపక్షాలు సైతం అదే బాటలో నడిచేలా చూడాలి.

> వైరస్ వ్యాప్తిపై అబద్ధాలు చెప్పినందుకు ఆంక్షలు విధించాలి. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ ఆంక్షలు అమలు చేయాలి.

> 2022 శీతాకాల ఒలింపిక్స్‌ వేదికను బీజింగ్‌ నుంచి మార్చేలా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని కోరాలి.

> అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలి. వాటిని దుష్ర్పచార సంస్థలుగా గుర్తించాలి.

> చైనా సరఫరా గొలుసుపై ఆధారపడడం వల్ల జరిగిన నష్టాన్ని, ప్రజా భద్రతకు పొంచి ఉన్న ముప్పుపై లోతైన విచారణ జరిపించాలి.

> ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్వతంత్రతను పెంచేలా సంస్కరణలు చేపట్టాలి. ప్రమాదకర వైరస్‌లపై ప్రపంచ దేశాల నిర్వహణ.. తదితర అంశాలపై నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. వీటిపై నిరంతరం నిఘా కొనసాగేలా ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి.

> అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని చైనా వేస్తున్న రుణ ఉచ్చును బయటపెట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి.

> ‘ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్స్‌ యాక్ట్‌(ఎఫ్‌ఐఎస్‌ఏ)ను తాజాపరచాలి.

తొలుత చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిక కరోనా వైరస్‌తో ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, ఈ పరిస్థితికి చైనాయే కారణమని తొలినుంచి అమెరికా ఆరోపిస్తోంది. డ్రాగన్‌ దేశం ఎప్పటికప్పుడు ప్రపంచంతో వైరస్‌ ప్రమాద తీవ్రతను పంచుకొని ఉంటే ఇంతటి విపత్కర పరిస్థితులు వచ్చేవి కాదని వాదిస్తోంది. చైనా మాత్రం వీటిని ఖండిస్తూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు ఎలాగైనా చైనానే బాధ్యతవహించేలా చేయాలన్న ఉద్దేశంతో తాజాగా 18 అంశాలతో కూడిన కార్యాచరణను రూపొందించింది.