Food

దివ్య ఔషధం…దబ్బకాయ పచ్చడి

Telugu Food And Diet News - Dabbakaya Pachadi In Telugu

పచ్చడి రూపంలోనో పులిహోర రూపంలోనో దబ్బకాయ మనందరికీ సుపరిచితమే అయినా క్రమేణా దీని వాడకం తగ్గిపోయింది. కానీ ఆగ్నేయాసియా, ఐరోపా దేశాల్లో ఇది అద్భుతమైన వాణిజ్య పంట. అంతేనా… అక్కడ అది పుల్లగానే కాదు, తియ్యని రుచుల్లోనూ నోరూరిస్తోంది.
*చిన్నప్పుడు జ్వరం తగ్గాక పత్యంలో భాగంగా- దేవుడి గదిలోని అల్మరాలో దాచిన జాడీలోంచి ఓ రెండు దబ్బకాయ ముక్కలు తీసి కంచంలో వేసి, తినమనేది బామ్మ. చాదస్తం అని అప్పట్లో పిల్లతరం అనుకోవచ్చుగాక కానీ దాని వెనక బలమైన కారణమే ఉంది. అందులోని విటమిన్‌-సి తెల్ల రక్తకణాల సంఖ్యని పెంచి, రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జ్వరంతో నీరసించిన శరీర అలసటని పోగొడుతుంది. అరుచిని తగ్గించి ఆకలిని పెంచుతుంది. అందుకే ఆయుర్వేదం దాన్ని నెత్తిన పెట్టుకుంది. ఉదర సమస్యలకు పరమౌషధంలా పనిచేసే మాదీఫల రసాయనంలో వాడే ప్రథమ ఫలం దబ్బకాయే. ధాత్రి, నారసింహా, దశమూల రసాయనాల్లోనూ ఈ పండును వాడతారు.
*ఇంగ్లిష్‌లో సిట్రాన్‌ దీని పేరు. తమిళంలో నార్తంకాయ్‌, మరాఠీలో మహాఫలం, మహాలుంగ అని పిలుస్తారు. సిట్రస్‌ పండ్లలోనే అత్యుత్తమ ఔషధ గుణాలున్న పండు ఇది. అందుకే దీని శాస్త్రీయనామం సిట్రస్‌ మెడికా. మనిషి ప్రమేయం లేని తొలినాటి సిట్రస్‌ పండ్లలో దబ్బ ఒకటి. నేడు మనం చూస్తోన్న నిమ్మ, కమలా, బత్తాయి… వంటి ఎన్నో సిట్రస్‌ జాతులు దీన్నుంచి పుట్టుకొచ్చినవే. ఇతర సిట్రస్‌ పండ్లతో పోలిస్తే గుజ్జుకన్నా తెల్లని నార(పీచు)భాగం ఎక్కువగా ఉండటం దబ్బకి ఉన్న మరో ప్రత్యేకత. అందుకే దీన్ని అచ్చ తెలుగులో నార దబ్బకాయ అంటారు. ఈ పండులో తొక్కా తెల్లని పీచూ గుజ్జూ అన్నీ ఔషధాలే, తినదగ్గవే.
*ఒకలాంటి వగరూ పులుపూ కలగలిసిన రుచితో ఉండే దబ్బ రకమే మనకి తెలుసు కానీ, ఇందులో ఇంకా చాలానే ఉన్నాయి. కార్సికాన్‌, డయామాంటె, ఎట్రాగ్‌, ఫింగర్డ్‌ సిట్రాన్‌(బుద్ధాస్‌ హ్యాండ్‌) రకాల్ని ఆగ్నేయాసియా, ఐరోపా, అమెరికా దేశాల్లో పండిస్తున్నారు. కార్సికాన్‌ రకమైతే పండుని కోయకుండా చెట్టుకే ఉంచేస్తే కొమ్మ మోయలేనంత భారీగా నాలుగైదు కిలోల వరకూ పెరుగుతుంది. బుద్ధాస్‌ హ్యాండ్‌లో గుజ్జే ఉండదు.
మిగిలిన రకాల్లోనూ తెల్లని రిండ్‌ శాతమే ఎక్కువ. పైగా ఇవన్నీ తియ్యని రుచితో ఉంటాయి. వీటిని ముక్కలుగా కోసి ఎండబెట్టి కేకులూ రొట్టెలూ స్వీట్ల తయారీలో వాడుతుంటారు. పంచదారద్రావణంలో ఉడికించి క్యాండీల్లానూ తింటారు. జామ్‌లూ సాస్‌లూ చేస్తారు.
దబ్బ స్వస్థలం భారతదేశమే. ఉత్తర భారత్‌లోని చిట్టగాంగ్‌, కాశీ, సితాకుండ్‌ ప్రాంతాల్లో బుద్ధాస్‌ హ్యాండ్‌తోబాటు పుల్లగా ఉండే బాజొరా, గుజ్జులేని ఛాంగురా, తియ్యని గుజ్జుతో భారీ సైజులోని మాథాంక్రి, మందపాటి తొక్కతో తియ్యగా ఉండే తురుంజ్‌… వంటి సిట్రాన్‌ రకాలు పండుతున్నాయి.
***భలే మందు!
పూర్వం సముద్ర ప్రయాణాల్లో తలెత్తే వికారానికీ శ్వాసకోశ వ్యాధులకీ పేగు సమస్యలకీ దబ్బకాయే మందు. దీని రసాన్ని విషప్రయోగానికి విరుగుడుగానూ వాడేవారు. డయేరియా, డీసెంట్రీలకు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి ఇస్తారు.
* సి-విటమిన్‌, కాల్షియం, ఐరన్‌, బీటాకెరోటిన్‌, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్‌-బి6..వంటి పోషకాలతోబాటు పీచూ ఇందులో ఎక్కువే.
* దబ్బకాయ తొక్కల్లోని సిట్రాల్‌, సిట్రీన్‌ వంటి పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంతోబాటు హానికర వైరస్‌లూ బ్యాక్టీరియాలతోనూ పోరాడతాయి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లూ తొక్కలోని లిమోనాయిడ్లూ క్యాన్సర్లని అడ్డుకుంటాయి.
* దబ్బ పండ్ల రసం గుండెకు మంచి టానిక్‌. ఇందులోని విటమిన్‌-సి, పొటాషియంలు బీపీనీ నియంత్రిస్తాయి. ఈ కాయల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దీర్ఘకాలిక నొప్పుల్ని తగ్గిస్తాయి.
* ఈ పండు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. భోజన కుతూహలం అనే గ్రంథం ప్రకారం కొద్దిగా పక్వానికి వచ్చిన దబ్బకాయ వాత, పిత్త, కఫ మూడు దోషాల్నీ తగ్గిస్తుందట. తొక్కతో సహా ఎండబెట్టి చప్పరిస్తే కఫ, వాత దోషాలూ నులిపురుగులూ తగ్గుతాయట. బెల్లం జోడించిన పండ్లరసం వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. దగ్గూ జలుబూ ఆస్తమా అన్నింటికీ దబ్బకాయ…. దివ్యౌషధం..!