Devotional

ఒడిబియ్యం ఎందుకు?

Why do the bride gets rice while leaving to in-laws in hindu weddings?

పుట్టింటివారు తమ ఆడబిడ్డను కాపురానికి పంపేటప్పుడు, లేదా పండుగలు వేడుకలు ఉత్సవాలు వివాహాల సమయంలో అన్నదమ్ములు తమ సోదరీలకు కొత్త బట్టలు పెట్టి ఒడిలో బియ్యం పోసి అందులో వీలైతే ఎండు కొబ్బెర ఖర్జూరాలు వేసి అత్తగారింటికి పంపడం తెలుగువారి ఆచారం.ఇది రాయలసీమవారి ప్రధాన సంప్రాదాయం. కోస్తావారు దీనినే పుట్టింటి పట్టుచీర అని అంటారు.

వడి బియ్యం పెట్టడం ఒక ఆచారమా సంప్రాదాయమా లేక ఇందులో ఏదైనా నిగూఢార్థం ఉందా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

అసలీ ఆచారాలను తెలుగుజాతికి పరిచయం చేసినవాడు ఆపస్తంబుడు.అంతవరకు అమలులోఉన్న పద్ధతులను క్రోడీకరించి సంస్కరించి ఆపస్తంబుడు కొన్ని సూత్రాలను తయారుచేశాడు.అవే ఆపస్తంభ సూత్రాలుగా ప్రసిద్ధి.ఈ నాటికి కూడా ఆంధ్రదేశ సంస్కృతిలో అన్ని కులాలవారు మతాలవారు ఏదో ఒక రూపంలో ఆచరిస్తున్నారు.

ఆపస్తంబుడు శాతవాహనుల పాలనాకాలంలో ఆంధ్రదేశంలో పర్యటించి అమలులోఉన్న పద్ధతులను అధ్యయనం చేశాడు.వాటిని క్రమబద్ధం చేశాడు.

అందులో వధువు మెడలో తాళి కట్టటం. అపస్తంబుడు వివాహ తంతులో తాళి కట్టడం వరకే చెప్పాడు కాని భర్త చనిపోతే తాళి తెంచాలని పసుపు కుంకుమలకు పుణ్య స్త్రీకి దూరం చేయాలని చెప్పలేదు.ఈ దురాచారం తరువాతి కాలంలో దాపురించింది..

వివాహ వ్యవస్థలో మేనరికాలు, వివాహతంతులో కాలి మెట్టెలు, తాంబూలం, వధువును అత్తగారింటికి పంపడం ఆయన ప్రవేశపెట్టిందే.

కృష్ణా గోదావరి తీర ప్రాంతాలలో నాగరికత వికసిస్తున్న దశలో ఈ “ఆపస్తంభ సుత్రాలు” సమాజానికి ఆచార వ్యవహారాలలో ఒక దిశానిర్దేశం చేశాయంటే అతిశయోక్తి కాదేమో.

వడి బియ్యం పెట్టుకొని వెళ్ళడమంటే పుట్టింటి అనుబంధానికి మూట కట్టుకొనిపోవడమేనని నా అభిప్రాయం.

పెండ్లి తరువాత నవవధువు అత్తగారింటికి బయలుదేరే ముందు అప్పగింతల సమయంలో తల్లి ఇంటిలో చుట్టుపట్లు ఉన్న బంధువుల, హితుల ఇళ్ళకు వధువు వెళ్ళి వడిలో బియ్యం పోయించుకురావటం ఆచారం.

ఎందుకు?

ఈ రోజులలో వేల కి.మీ.దూరం నైనా చిటికలో అధిగమిస్తున్నాం.అదే 80 సం॥క్రిందటి వరకు గుర్రం, నడక, ఎద్దుల సవారీబండి,మేనాలు, పల్లకిలే రవాణాకు ఉపయోగించేవారు.

వధువు అత్తగారింటికి వెళ్ళితే అక్కడి పరిస్ధితులు ఏలా ఉంటాయో తెలియదు. నడకతో ప్రయాస, ఆకలి రెండు ఉంటాయి. ప్రయాస పడినవారు ఆహారాన్వేషణ చేయలేరు. అకలికి అన్నం కావాలి. ఒకవేళ ఇంటిలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర లాంటి ధాన్యం ఉంటే అవి instant grain కాదు.

అందుకే బిడ్డ ఇబ్బంది పడకూడదని తల్లి ఒడిలో బియ్యం నింపి పంపుతుంది.NTR పుణ్యామా అని తెల్లన్నం ఈ రోజు అందరికి అందుబాటులోనికి వచ్చింది కాని ఆ రోజులలో బియ్యం ఏ ఇంటిలో ఉండేవి?.ఉండే చిటికడో, చారడో బియ్యాన్ని అకస్మాత్తుగా వచ్చే అతిథి కోసమో, జ్వరం వచ్చిన రోగికి వండి పెట్టటానికో ఉంచుకొనెవారు.అంటే stocks ఉండేవి కావు. అందుకే వధువు బంధువుల ఇళ్ళకు వెళ్ళి వారికి ఉన్న వాటిలో గుప్పెడు బియ్యం వడిలో పోయించుకొని వచ్చేది.

ఇంత దూరదృష్టితో ఆలోచించే పెద్దలు బియ్యాన్ని వడిలో ప్రేమతో నింపేవారు.

ఆడబిడ్డలందరు కులం మతం లేకుండా దీన్నో హక్కుగా భావించాలి.