Business

47వేలు దాటిన బంగారం

Gold Price Rises Crazy In India. Projected To 50000.

నానాటికీ బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇవన్నీ పసిడి ధరను పెంచేశాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు బంగారంలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధర కొండెక్కి కూర్చొంటోంది. సోమవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.47,865కు చేరింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండి 3శాతం పెరిగి రూ.48,208 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఏకంగా 1శాతం పెరిగిన బంగారం ధర ఔన్సు 1,760.85 డాలర్లకు పెరిగింది. 2012, అక్టోబరు 12 తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. యూస్‌ గోల్డ్‌ ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో ఔన్సు 1,770.50 డాలర్లకు వద్ద ట్రేడ్‌ అవుతోంది. భవిష్యత్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50వేల మార్కును తాకుతుందా? అంటే మార్కెట్‌ నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. ‘‘అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి బంగారానికి మించిన పెట్టుబడి లేదు. అందుకే మదుపరులు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం అడ్డుకట్టకు, నగదు విలువ పతనమవుతున్న పరిస్థితుల్లో బంగారం నమ్మకమైన పెట్టుబడి సాధనం. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2వేల డాలర్లు తాకినా ఆశ్చర్యపోనవసరం లేదు. దేశీయంగా పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50వేలు తాకవచ్చేమో’’ అని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.