Health

కృష్ణలంకలో 120కు చేరిన కరోనా కేసులు

Vijayawada Krishna Lanka Corona Cases Cross 120

ఒకటో రెండో కాదు.. కృష్ణలంకలో కరోనా కేసుల సంఖ్య వంద దాటి 120కి చేరింది. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో సగటున ప్రతి వెయ్యి మందిలో ఒకరికి కరోనా సోకింది. రెడ్ జోన్ నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడం, కొందరు రాజకీయ నాయకుల మూర్ఖపు చర్యల ఫలితంగా కృష్ణలంక ప్రజలకు కరోనా మహమ్మారి నుండి విముక్తి లభించడం లేదు. రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజా క్షేమం ఏమాత్రం పట్టని కొందరు నేతల నిర్వాకంతో కృష్ణలంక ప్రజలు కరోనా సామూహిక వ్యాప్తి భయంతో బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రెడ్ జోన్ ఆంక్షలను అధిగమించి విశృంఖలంగా వ్యవహరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. లెక్కకుమిక్కిలిగా పోలీసులున్నా నేతలు చేస్తున్న కరోనా పంపిణీ కార్యక్రమాలను నిలువరించలేకపోతున్నారని, కూరగాయల పంపకాలనే అడ్డుకోలేని పోలీసులు, కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేయగలరని స్థానికులు పెదవి విరుస్తున్నారు. లాక్ డౌన్ నాల్గవ దశకు చేరినా కరోనా అదుపులోకి రాకపోవడంతో పాటు, ఆదివారం ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు బయటపడటంతో కృష్ణలంకలో మరోమారు కలకలం రేగింది. గత కొద్దిరోజులుగా కరోనా ప్రభావం లేని గౌతమినగర్ లో తాజాగా రెండు కేసులు బయటపడటం స్థానికులను భయకంపితులను చేసింది. లాక్ డౌన్ అమలు సక్రమంగా జరగకపోవడం, రాజకీయ నాయకుల పంపిణీ కార్యక్రమాల కారణంగానే కృష్ణలంకలో కరోనా వ్యాప్తి కొనసాగుతోందని ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. జరగబోయే ఎన్నికల్లో గెలుపు సాధించడం తప్ప మరో ఆలోచనే లేని నేతలు, కూరగాయలతో పాటు కరోనా మహమ్మారిని సైతం ఇంటింటికీ ఉచితంగా చేరవేస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థి అడపా శేషగిరిరావు గడచిన నాలుగైదు రోజులుగా 20వ డివిజన్ పరిధిలో కూరగాయల పంపిణీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వెనుక కారణాలేమిటని ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యంత్ర విహంగాల (డ్రోన్) నిఘా పేరుతో ఒక్కరోజు ప్రచారార్భాటం, అధికార పార్టీ కార్యకర్తలకు లాఠీలిచ్చి హల్ చల్ చేయించడం, హెల్ప్ డెస్క్ పేరుతో హంగామా చేసిన కృష్ణలంక పోలీసులు కరోనా కట్టడిలో దారుణంగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా లాక్ డౌన్ ఆరంభమై 54 రోజులు గడిచి, 120 పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత తీరిగ్గా మైకులు పెట్టి ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం విస్తుగొలుపుతోందని వారు ఎద్దేవా చేస్తున్నారు. సామూహిక వ్యాప్తి ముప్పు పొంచివున్న ప్రస్తుత తరుణంలోనైనా పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాజకీయ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కరోనా పంపకాలను కట్టిపెట్టాలని కృష్ణలంక ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న కృష్ణలంకపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమను రక్షించాలని ప్రజలు వేడుకొంటున్నారు.

రెడ్ జోన్ నిబంధనలివి..
• ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వీల్లేదు. వీధిలోకే కాదు.. కనీసం పక్కింటికి వెళ్లడానికి కూడా అనుమతి ఉండదు.
• సదరు ప్రాంతానికి వెళ్లే అన్ని వైపులనూ బారికేడ్లతో దిగ్బంధించి, ఆ ప్రాంతం రెడ్ జోన్ అని సూచించే బోర్డులను పెడతారు. అక్కడ 24 గంటలూ పోలీసు కాపలా ఉంటుంది.
• బయటి ప్రాంతాల వ్యక్తులకు రెడ్ జోన్లలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. గుర్తింపు పొందిన అధికారులు, హెల్త్ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్రమే బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
• పాలు, కూరగాయలు తదితర నిత్యావసరాలను అధికారులే ప్రజల ఇళ్ల వద్దకు చేరుస్తారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.
• అత్యవసర పరిస్థితుల్లో సైతం రెడ్ జోన్ పరిధిలోని వారు పోలీసుల అనుమతితోనే బయటకు రావాల్సివుంటుంది.
• రెడ్ జోన్ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాల సాయంతో పిచికారీ చేయిస్తారు.
• కరోనా పాజిటివ్ కేసు నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో వైరస్ ఉందని సూచించేలా ప్రత్యేక స్టిక్కర్లను అంటిస్తారు.
• ఇక ఈ ప్రాంతంలోని వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో, రోజుకు రెండుసార్లు హెల్త్ వర్కర్లు పరీక్షిస్తుంటారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారి నమూనాలను సేకరించి, క్వారంటైన్ చేస్తారు.
• రెడ్ జోన్ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలుంటాయి. ఈలోగా కొత్త కేసులు రాకుండా ఉంటేనే ఆంక్షలను సడలిస్తారు.
• కొత్తగా కేసులు నమోదైతే, ఆపై మరో 14 రోజులు ఇవే ఆంక్షలు కొనసాగుతాయి.