Agriculture

తెలంగాణాలో వ్యవసాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telugu Agriculture News-Telangana Agri AEO 194 Jobs Open

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పొరుగు సేవల విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖలో 2,638 ఏఈవో పోస్టులకు గానూ 2,444 మంది విధుల్లో ఉన్నారని తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం మిగిలిన 194 క్లస్టర్లలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏఈవోల భర్తీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. రెగ్యులర్‌ ప్రాతిపదికన అధికారులను నియమించే వరకు క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు రాకుండా వీరిని నియమించడం జరుగుతుందన్నారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలుతో రైతును మరింత ఉన్నతస్థితిలో ఉంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.