DailyDose

దూసుకెళ్లిన భారత స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Indian Stock Markets Are Happy

* వరుసగా నష్టాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు లాభపడ్డాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడం.. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మదుపర్లను మెప్పించడంలో విఫలం కావడంతో సోమవారం భారీ నష్టాలను చవి చూసిన మార్కెట్లు కోలుకున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 167 పాయింట్లు లాభపడి, 30,196 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ పాయింట్ల 55.85 పాయింట్ల లాభంతో 8,879 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.63 వద్ద కొనసాగుతోంది.

* కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా పసిడి ఆభరణాల తనఖా వ్యాపారం పెరుగుతుందని అంచనా వేస్తున్న కెనరా బ్యాంక్‌, ప్రత్యేక పసిడి రుణ విభాగాన్ని, పథకాన్ని ప్రకటించింది. జూన్‌ 30 వరకు ఈ పథకం కింద 7.85% వార్షిక వడ్డీ రేటుకే పసిడి తనఖా రుణాలు అందించనుంది. ‘వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, వ్యాపార అవసరాలు, ఆరోగ్య అత్యవసరాలు, వ్యక్తిగత అవసరాలు.. ఇలా దేనికైనా ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు. దేశంలో ఎంపిక చేసిన శాఖల్లో ఈ రుణాలు పొందవచ్చ’ని బ్యాంకు వెల్లడించింది. ఈ రుణాలను ఏడాది నుంచి 3 ఏళ్లలోపు చెల్లించే వీలునూ బ్యాంక్‌ కల్పిస్తోంది. ‘ఖాతాదారుల అత్యవసరాలు తీరేలా, రుణ మద్దతు అందించాలనుకుంటున్నామ’ని కెనరా బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ డి.విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

* కాంచీపురం ప్లాంటులో ఉత్పత్తి పునరుద్ధరించినట్లు ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్‌ ఇండియా సోమవారం తెలిపింది. ఈనెల 5నే అధికారుల నుంచి అనుమతులు వచ్చాయని, ఉద్యోగులు -కార్మికుల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసి, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ వివరించింది. చెన్నైలోని సంస్థ ప్రధాన కార్యాలయం కూడా పనులు ప్రారంభించింది.

* కరోనా కారణంగా దెబ్బతిన్న ఐరోపా దేశాల కోసం 50000 కోట్ల యూరోల (543 బిలియన్‌ డాలర్లు లేదా దాదాపు రూ.41 లక్షల కోట్ల)తో ఒక నిధి ఏర్పాటు చేయాలని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాధినేతలు ప్రతిపాదించారు. ప్రతిపాదిత నిధి ద్వారా ఐరోప సమాఖ్య (ఈయూ) బడ్జెట్‌ వ్యయాలను భరించవచ్చని.. కరోనా కారణంగా ఇబ్బందుల పాలైన రంగాలకు, ఐరోపా దేశాలకు సహాయం చేయవచ్చని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ ప్రతిపాదన కింద 26 ఈయూ దేశాలు ఆర్థిక మార్కెట్ల నుంచి రుణాలు పొందడానికి వీలవుతుంది. డీలాపడ్డ రంగాలకు, ప్రాంతాల కోసం 50000 కోట్ల యూరోలను ఉపయోగించుకోవచ్చ’ని మాక్రాన్‌ పేర్కొన్నారు. ‘నగదు బదిలీని ప్రతిపాదిస్తున్నాం. ఇది చాలా పెద్ద అడుగు’ అని ఆయన పేర్కొన్నారు. ‘అసాధారణ సంక్షోభం సమయంలో.. అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నామ’ని మెర్కెల్‌ పేర్కొన్నారు. మరో వైపు ఈ ప్రతిపాదనను యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లీయెన్‌ ఆహ్వానించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రానందున, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కొత్త ఖాతాలను తెరిచే ప్రక్రియలో డిజిటలీకరణ చేపట్టింది. వీడియో ఆధారిత కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌బీఐ వీడియో ఆధారిత కేవైసీ ప్రక్రియకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ‘కోటక్‌ 811 సేవింగ్స్‌ ఖాతా’ తెరవడానికి వీడియో కేవైసీ ప్రక్రియలో భాగంగా ఆధార్‌, పాన్‌ వివరాలను ఖాతాదారులు తెలియజేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో కొత్త ఖాతా తెరిచేందుకు ఖాతాదారుడు విజ్ఞప్తి చేసుకుంటే.. బ్యాంక్‌ ప్రతినిధి వీడియో కాల్‌లో అందుబాటులోకి వస్తారు. ఖాళీ కాగితంగా వినియోగదారుడు సంతకం చేయడం వంటి వాటితో కూడిన మొత్తం వీడియోను బ్యాంక్‌ తన దగ్గర దాచిపెట్టనుంది. ఇంతకుముందు కొత్త ఖాతాలు తెరిచేందుకు పూర్తిగా ఆధార్‌పై ఆధారపడేవారు. వీడియో కేవైసీ ద్వారా కేవలం భారత పౌరులు మాత్రం కొత్త ఖాతాలను తెరవొచ్చని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

* సంయుక్త సంస్థ అయిన నోరిష్‌కో బెవరేజెస్‌లో పెప్సికో వాటా కొనుగోలు చేస్తామని టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (టీసీపీఎల్‌) తెలిపింది. ఇందుకు ఎంత వెచ్చించనుందీ సంస్థ వెల్లడించలేదు. టీసీపీఎల్‌, పెప్సికోలకు నోరిష్‌కోలో చెరి 50 శాతం వాటాలున్నాయి. హిమాలయన్‌ మినరల్‌ వాటర్‌, టాటా గ్లూకోప్లస్‌ , టాటా వాటర్‌ప్లస్‌ వంటి ఉత్పత్తులు నోరిష్‌కోవే. ఆహార, పానీయాల విపణిలో మరింతగా వృద్ధి చెందేందుకు టాటా గ్రూప్‌నకు ఈ పరిణామం ఉపకరిస్తుందని టీసీపీఎల్‌ పేర్కొంది.