DailyDose

ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాలి-TNI కరోనా బులెటిన్

TNILIVE Corona Bulletin-AP Mandates 100% Attendance Of Govt Employees

* రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 21నుంచి సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని చెప్పింది. కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో యథావిధిగా విధులకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

* లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలైంది. మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే శ్రీదేవి.. జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారని న్యాయవాది ఇంద్రనీల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురిపై లాక్‌డౌన్‌ ఉల్లంఘనల పిల్‌, నోటీసులు జారీ అయ్యాయి.

* ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను తప్పుబట్టేందుకు ఇది సమయం కాదని యూరోపియన్‌ యూనియన్‌ పేర్కొంది. కరోనా వ్యాధిపై మొదట్లోనే సమాచారం అందినప్పటికీ దాన్ని నిర్ధారించుకోవడంలో ఆరోగ్యసంస్థ విఫలమైందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆ సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌కు లేఖ రాసిన సంగతి తెలిపిందే. దీంతో పాటు రానున్న 30 రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ తన విధానాలను మెరుగుపరుచుకోకపోతే నిధుల్ని శాశ్వతంగా ఆపేందుకు కూడా వెనకాడబోనని తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.

* దేశంలో గత 24 గంటల్లో 2,350 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 39,174కి పెరిగింది. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 38.73 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

* కర్ణాటకలో గత 24 గంటల్లో 149 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు సాయంత్రం ఐదు వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,395. ఇందులో 811 యాక్టివ్‌ కేసులు కాగా, 41 మంది చనిపోయారు. 543 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.

* కరోనాతో బాధపడి, కోలుకున్న 28 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. మరోవైపు దిల్లీలో ఒక కేసు నమోదైంది. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 89కి చేరింది. ఒకరు మృతి చెందగా, ఈ రోజు డిశ్చార్జి అయినవారితో కలిపి మొత్తం 205 మంది రికవరీ అయ్యారు. మరోవైపు బీఎస్‌ఎఫ్‌లో ఈ రోజు మూడు కేసులను గుర్తించారు. 22 మంది నయమై డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 192కి పెరిగింది. ఇంకా 144 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* రెండు, మూడు రోజుల్లో ప్రజా రవాణాను ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. స్పందనలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులకు అనుమతి లేదని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభమవుతాయని సీఎం చెప్పారు. ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. దీని కోం జులై 31లోగా పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.