Movies

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…సిరివెన్నెల జన్మదినం ప్రత్యేకం

Happy Birthday To Sirivennela Seetarama Sastry - TNILIVE Special

అక్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి. పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి. తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆర్దత్ర, ఆలోచన… ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమైన’ ప్రయాణం ఆయనది. ‘అమృతగానమది అధరముదా, అమితానందపు యదసడిదా’ అని ఆశ్చర్యపరిచిన గీత రచన ఆయనది. ఆయన పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం… అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు. అందుకే ఆయన్ని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. తన తొలి చిత్రం పేరు ‘సిరివెన్నెల’నే, తన ఇంటి పేరుగా మార్చుకొన్న సీతారామశాస్త్రి… చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జన్మించారు. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్‌.బి.బి.ఎస్‌ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్‌.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపించారు. ఆ తర్వాత ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’, ‘శృతిలయలు’, ‘శివ’, ‘క్షణక్షణం’, ‘గాయం’, ‘గులాబి’, ‘మనీ’, ‘శుభలగ్నం’… ఇలా ఎన్నో చిత్రాల్లో గీతాలు రాశారు. తరాలు మారుతున్నా సరే… సీతారామశాస్త్రి కలం మాత్రం శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. సినిమాకీ, అందులో సందర్భానికి తగ్గట్టే కాకుండా… సమాజాన్ని కూడా ప్రతిబింబించేలా పాట రాయడం సిరివెన్నెల ప్రత్యేకత. ఆయన ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు పది సార్లు అందుకొన్నారు. ఈ రోజు సిరివెన్నెల పుట్టినరోజు.