DailyDose

నిధుల వరదలో జియో-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Jio Gets New Investments

* రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ మరో సంచలన ఒప్పందం ఖరారు చేసుకుంది. అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్ కంపెనీ జియోలో రూ. 11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇప్పటి వరకు ఆసియాలో కేకేఆర్ సంస్థ పెట్టుబడుల్లో ఇదే అదిపెద్ద డీల్ కావడం విశేషం. తాజాగా ఒప్పందంతో జియోలో 2.32 శాతం ఈక్విటీ వాటా సదరు సంస్థకు దక్కనుంది. కాగా గత నెలరోజులుగా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జెనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి టెక్ దిగ్గజాలు చేసుకున్న ఒప్పందాలతో జియోకి రూ.78,562 కోట్ల పెట్టుబడులు సమకూరాయి.ఏప్రిల్ 22న 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్.. జియోలో రూ.43,574 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. తర్వాత కొద్ది రోజులకే సిల్వర్ లేక్ సంస్థ రూ.5,665.75 కోట్లతో జియోలో 1.15 శాతం వాటా తీసుకుంది. ఈ నెల 8న అమెరికాకి చెందిన మరో దిగ్గజ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్ 2.32 శాతం వాటా కోసం రూ.11,367 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఇదే నెల 17న మరో గ్లోబల్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ.6,598.38 కోట్లతో 1.34 శాతం వాటా కొనుగోలు చేసింది.

* చైనా, హాంకాంగ్‌లను దృష్టిలో పెట్టుకొని భారత్‌ కొత్తగా ఫారెన్‌పోర్టు ఫోలియోలపై దృష్టిపెట్టింది. వీటిని కూడా పరిశీలించేలా సరికొత్త నిబంధనలను తయారు చేసిందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. భారత్‌తో భూభాగంపై సరిహద్దులు పంచుకొనే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలను పరిశీలించాలన్న నిర్ణయం వచ్చిన కొన్ని వారాలకే ఎఫ్‌పీఐలపై కూడా దృష్టిపెట్టడం గమనార్హం. అప్పట్లో భారత్‌ కంపెనీలను విదేశీ టేకోవర్ల నుంచి రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వచ్చాక చైనా ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐల రూపంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టి కంపెనీ వాటాలతోపాటు నియంత్రణను దక్కించుకొంటారేమోనని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

* రాజీనామా చేయాలని 2,000 మంది ఉద్యోగులను కోరినట్లు ఆర్థిక సేవల సంస్థ ఇండియాబుల్స్‌ తెలిపింది. ఇవి తొలగింపులు కాదని, ఏటా వలసలు/పనితీరు ఆధారంగా 10-15 శాతం మంది సంస్థ నుంచి వైదొలగుతుంటారని సంస్థ పేర్కొంది. 2019-20లో సంస్థలో 26,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 7,000 మంది కొత్తవారు.

* జీఎంఆర్‌ గ్రూపు సంస్థ అయిన జీఎంఆర్‌ కమలాంగ ఎనర్జీ లిమిటెడ్‌ విక్రయం ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఈ సంస్థలో తన వాటా మొత్తాన్ని జెఎస్‌డబ్లూ ఎనర్జీకి విక్రయించాలని కొంతకాలం క్రితం జీఎంఆర్‌ గ్రూపు నిర్ణయించిన విషయం విదితమే. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరింది. కానీ కొవిడ్‌- 19 మహమ్మారి విస్తరించడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు కావటంతో ఈ విక్రయాన్ని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరాక, ఈ విక్రయ వ్యవహారాన్ని తిరిగి పరిశీలిస్తామని జీఎంఆర్‌ గ్రూప్‌ పేర్కొంది. ప్రస్తుతం జీఎంఆర్‌ కమలాంగ్‌ ఎనర్జీ యూనిట్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు వివరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.90,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, దీనివల్ల విద్యుత్తు రంగం కోలుకునే అవకాశం ఏర్పడుతుందని జీఎంఆర్‌ గ్రూపు అభిప్రాయపడింది.

* దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే 2021 ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు నెగిటివ్‌గానే నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సంక్షోభం నేపథ్యంలో ఉదయం నుంచి మార్కెట్లు ఆచితూచి కదలాడాయి. ఆర్‌బీఐ ప్రకటనలు ఏమాత్రం సంతృప్తిపరచకపోవడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఉదయం 11 గంటలకు సెన్సెక్స్‌ 416 పాయింట్లు నష్టపోయి 30,516 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 123 పాయింట్లు దిగజారి 8,982 వద్ద ట్రేడవుతోంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో కోలుకొని స్వల్ప లాభాల్లో పయనించాయి. కానీ, ఆర్‌బీఐ నిర్ణయాలతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.99 వద్ద కొనసాగుతోంది. రెపో రేటును 4.40 శాతం నుంచి 4 శాతానికి, రివర్స్‌ రెపో రేటును 3.35 శాతానికి కుదిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే టర్మ్‌ లోన్లపై ఉన్న మారటోరియాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించింది.