DailyDose

అంతర్జాతీయ విమానాలు ఆగస్టు లోపే-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Indian International Travel To Resume Before Aug

* ఆగస్టుకు ముందే సాధ్యమైనంత మేరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి అన్నారు. ఈ సోమవారం (ఈ నెల 25) నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

* ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి షిర్డీ – హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమాన ప్రయాణ టిక్కెట్లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైంది.

* ‘ఆత్మనిర్భర్‌భారత్‌’ ఉద్దీపన ప్యాకేజీని సత్వరం అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ) అధిపతులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో ఉద్దీపన అమలుపై బ్యాంకుల సంసిద్ధతను మంత్రి ఆరా తీశారు. ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లు, ఇతర వినియోగదార్ల అవసరాలను త్వరితగతిన తీర్చాల్సిన అవసరం ఉందని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆర్థిక మంత్రి కోరిన’ట్లు ఆర్థిక సేవల విభాగం ట్వీట్‌ చేసింది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అదనపు రుణాలను వేగంగా జారీ చేయాలని ఆర్థిక మంత్రి నొక్కిచెప్పినట్లు సమావేశానంతరం ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పద్మజ చుండూరు పేర్కొన్నారు. ప్యాకేజీ కింద వివిధ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే అనుమతులు ఇవ్వగా.. మార్గదర్శకాలు బ్యాంకులకు జారీ అవుతూ ఉన్నాయి. రూ.3 లక్షల కోట్ల విలువైన అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్‌జీస్‌) ఇందులో అత్యంత ముఖ్యమైనది.

* ‘క్లోరోక్విన్‌’ ఔషధం తీసుకోవడం ద్వారా కొవిడ్‌- 19 రాకుండా నివారించవచ్చా… అనే కోణంలో పరిశోధనలు చేపట్టిన అమెరికా కొలంబియా యూనివర్సిటీకి అండగా నిలవాలని హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా నిర్ణయించింది. అమెరికాలోని తన మార్కెటింగ్‌ భాగస్వామి అయిన రైజింగ్‌ ఫార్మాసూటికల్స్‌ ద్వారా క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌ ఔషధాన్ని కొలంబియా యూనివర్సిటీకి ఉచితంగా అందిస్తోంది. క్లోరోక్విన్‌, మలేరియా వ్యాధికి మందు అనేది తెలిసిన విషయమే. దీనిపై కొలంబియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న కొవిడ్‌- 19 పరీక్షలు రెండో దశకు చేరుకున్నాయి. కొలంబియా యూనివర్సిటీలోని ఇర్వింగ్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేసే దాదాపు 350 మంది వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది వంటి ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇదే తరహా ఔషధ పరీక్షలు చేపట్టిన ‘క్రౌన్‌ కొలాబరేటివ్‌’ కు ఇదే ఔషధాన్ని నాట్కో ఫార్మా సరఫరా చేస్తోంది.

* ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఏప్రిల్‌ నుంచి రూ.26,242 కోట్ల రిఫండ్‌లను జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి మే 21 మధ్య 16,84,298 మంది పన్ను చెల్లింపుదార్లు ఈ రిఫండ్‌ నగదు పొందారని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఇందులో ఆదాయపు పన్ను రిఫండ్‌ల కింద 15,81,906 మందికి రూ.14,632 కోట్లు జారీ చేశామని పేర్కొంది. 1,02,392 మంది కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదార్లకు రూ.11,610 కోట్ల రిఫండ్‌లు ఇచ్చామని వెల్లడించింది. ప్రజల వద్ద నగదు లభ్యత పెరిగేందుకు, కొవిడ్‌-19 సంక్షోభంతో పోరాడటానికి, కంపెనీలు తగినన్ని నిధులు కలిగి ఉండేందుకు రిఫండ్‌ల జారీ ప్రక్రియను ఐటీ విభాగం వేగిరం చేసిన సంగతి తెలిసిందే. గత వారం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసినప్పటి నుంచి రిఫండ్‌ల జారీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. మే 16తో ముగిసిన వారంలో రూ.2,050.61 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్‌లను, రూ.867.62 కోట్ల కార్పొరేట్‌ పన్ను రిఫండ్‌లను ఐటీ విభాగం ప్రాసెస్‌ చేసింది. మే 17-21 తేదీల్లో ఆదాయపు పన్ను రిఫండ్‌ల కింద రూ.2,672.97 కోట్లు, కార్పొరేట్‌ పన్ను రిఫండ్‌ల కింద రూ.6,714.34 కోట్లను పన్ను చెల్లింపుదార్ల ఖాతాలో వేసింది. అంటే మొత్తంగా ఈ వారంలో రూ.9,387.31 కోట్ల రిఫండ్‌లను ఐటీ విభాగం జారీ చేసిందన్నమాట.