Business

21రోజుల్లో ₹5440కోట్లు కట్టాలి

UK Court Shocks Anil Ambani To Pay 700Million Dollars

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి యూకే కోర్టు భారీ షాక్ ఇచ్చింది. రుణాల ఎగవేత కేసులో మూడు చైనా బ్యాంకులకు ఆయన 700 మిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ లండన్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. భారత కరెన్సీలో రూ.5,440 కోట్ల విలువైన ఈ మొత్తాన్ని 21 రోజుల్లో చెల్లించాలని గడువు విధించారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు బ్యాంకు రుణాల కోసం కోసం 2012లో అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చినట్టు జస్టిస్ నీగెల్ టియరే తన తీర్పులో పేర్కొన్నారు.యూకే కోర్టు తీర్పుతో.. ప్రస్తుతం తన ఆస్తి విలువ ‘‘జీరో’’ అంటున్న అనిల్‌ అంబానీకి కొత్త చిక్కులు మొదలైనట్టేనని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అనిల్ అంబానీ అన్న, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఆదుకున్నసంగతి తెలిసిందే. చివరి నిమిషంలో ముకేశ్ ఆయన బకాయిలను చెల్లించడంతో తృటిలో జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారు. కాగా అనిల్ అంబానీపై ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా సహా మూడు చైనా బ్యాంకులు కోర్టును ఆశ్రయించిన వాటిలో ఉన్నాయి.