WorldWonders

దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసిన IAS. కొత్త వాహనం కావాలన్న పోలీసులు.

Tirupati Urban Crime Branch Police Demand New Vehicle To Enquire Theft At IAS TTD JEO

టీటీడీ జేఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి బసంత్ కుమార్ ఇంట్లో చోరీ కేసులో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు విచారణ జరుపుతున్న తిరుపతి క్రైమ్ పోలీసుల వింత కోరికతో టీటీడీ అధికారులు అవాక్కయ్యారు. చోరీ జరిగిన ఇంట్లో సేకరించిన ఆధారాల మేరకు నిందితులను గాలించి పట్టుకునేందుకు తమకు ఓ ఫోర్ వీలర్ కావాలని కోరుతూ తిరుపతి అర్బన్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది కూడా మంచి కండిషన్‌లో ఉన్న వాహనం కావాలని పేర్కొనడం చూసి అధికారులు షాకవుతున్నారు. తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఓ ఐఏఎస్ అధికారి స్వయంగా ఫిర్యాదు చేస్తే తమకు కారు కావాలంటూ పోలీసులు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రెండురోజుల కిందట టీటీడీ జేఈవో బసంత్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన 18 తులాల బంగారం, వెండితో సహా సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఈ ఘటనపై జేఈవో తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. దొంగలను పట్టుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు కారు అడుగుతూ లేఖ రాయడం సంచలనంగా మారింది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేస్తే వాహనాలు సమకూర్చాలని పోలీసులు లేఖ రాయడంపై విమర్శలొస్తున్నాయి.