DailyDose

బోర్డులో మరోసారి చర్చిస్తాం-తాజావార్తలు

Subbareddy Speaks About TTD Land Auction - Telugu Breaking News Roundup Today

* సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటనను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) ఈ ఘోరానికి పాల్పడ్డాడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టి….ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడించారు. ‘‘గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్‌కు చెందిన సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్‌ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు.

* నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ భూముల విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయాల్సింది పోయి అదే తప్పు చేయాలని తితిదే భావించడాన్ని ఎంపీ తప్పుబట్టారు. ఆస్తుల అమ్మకం భగవంతుడికి తితిదే చేస్తున్న ద్రోహం అని ఎంపీ తప్పుబట్టారు.

* తితిదే భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని తెలిపారు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవారి ఆస్తుల విషయంలో ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దు. తితిదే భూములు అమ్మాలంటే కేవలం రూ.కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్మాలా? గత ప్రభుత్వం ఎన్నో విలువైన భూములను అమ్మేసింది. కేవలం రాజకీయ వ్యతిరేకతతోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుల ద్వారా అడ్డుకున్నది మేమే. తితిదేకి భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి బాధ్యతగా ఖర్చు చేస్తాం. తితిదే ఆస్తులను కాపాడాలనేదే మా ఉద్దేశం’’ అని సుబ్బారెడ్డి అన్నారు.

* తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన రోడ్డు మార్గంలో అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ కూడా ఉన్నారు.

* తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన ఆస్తులను నిరర్థకమనడం అనడం దాతలను అవమానించడమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆస్తులను ధర్మ ప్రచారానికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలే తప్ప….విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తితిదే ఆస్తుల విక్రయంపై స్పందిస్తూ సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

* వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చి ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ‘‘మన పాలన-మీ సూచన’ పేరిట విభాగాల వారీగా సీఎం మేధోమథన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో జగన్‌ మాట్లాడుతూ…..అర్హులైన వారందరికీ సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సేవలు అందిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఏడాది తిరగకముందే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం’’ అని జగన్‌ అన్నారు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం అన్ని జాగ్రత్తలూ చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉంటాయని, ఏదైనా అవసరమొచ్చినప్పుడు వారితో మాట్లాడతామని తెలిపారు. ఇవాళ 19 చొప్పున విమానాలు వచ్చి వెళతాయని, రేపటి నుంచి విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని సీఎస్‌ చెప్పారు. ప్రయాణికులు లేకే కొన్ని విమానాలు రద్దు అవుతున్నాయని వివరించారు.

* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట ఘటనలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక హత్యను కప్పిపుచ్చేందుకు నిందితుడు ఏకంగా 9 హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొలుత మక్సూద్‌ బంధువైన యువతిని నిందితుడు సంజయ్‌కుమార్‌ హత్య చేశాడు. మార్చి 8న ఆమెను హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కోల్‌కతా తీసుకెళ్తున్నట్లు చెప్పి నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్‌ కుటుంబాన్ని హతమార్చాడు. దీంతో మొత్తం 10 మందిని నిందితుడు సంజయ్‌కుమార్‌ హత్య చేసినట్లయింది.