Devotional

Flash: తితిదే ఆస్తుల వేలన్ని నిలిపేసిన జగన్ సర్కార్

TTD Assets Auction GO Cancelled By AP Govt

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని తీర్మానించింది. దీనికి సంబంధించి తీర్మానం నెం.253 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని కొద్ది రోజుల క్రితం తితిదే బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తీర్మానాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TTD Assets Auction GO Cancelled By AP Govt