Editorials

కరోనా…చైనా చెర్నోబిల్!

USA Slams Coronavirus As China's Version Of Chernobyl

కరోనా వైరస్‌ మహమ్మారిగా మారడానికి కారణమైన చైనాపై అమెరికా ఆరోపణల పర్వం కొనసాగుతోంది. సోవియట్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణుప్రమాదంతో కరోనావైరస్‌ను పోలుస్తూ చైనాపై విమర్శలు గుప్పించింది. కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో డ్రాగన్‌ వ్యవహార శైలి, చెర్నోబిల్‌ దుర్ఘటన సమయంలో సోవియట్‌ తీరులాగే కనిపిస్తోందని తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ విమర్శించారు. వైరస్‌తో ఏం జరుగుతుందన్న విషయం చైనాకు ముందే తెలిసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పుదోవ పట్టించిందన్నారు. వైరస్‌ సమాచారాన్ని బయటకు పొక్కనీయకుండా చైనా అడ్డుపడిందని విలేకరుల సమావేశంలో ఓబ్రియన్‌ ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనానికి కారణమైన ఈ వైరస్‌ను ప్రపంచం మీదకు చైనా వదిలిపెట్టిందని దుయ్యబట్టారు. చెర్నోబిల్‌ దుర్ఘటనలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని దాచిపెట్టిన తీరు చరిత్రలో ఉండిపోతుందని అన్నారు. మరో 10 లేదా 15 సంవత్సరాల తర్వాత హెచ్‌బీఓ ఛానెల్‌లో ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని చూస్తామని రాబర్ట్‌ ఓబ్రియన్‌ అభిప్రాయపడ్డారు. చెర్నోబిల్‌ ఘటన సమయంలో అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రపంచానికి చెప్పడంలో నాటి సోవియట్‌ యూనియన్‌ ఆలస్యం చేసినందునే అది ఘోర ప్రమాదంగా మారిందని అన్నారు. ప్రస్తుతం చైనా వ్యవహరించిన శైలి కూడా అదేవిధంగా ఉందని విమర్శించారు. వైరస్‌ విజృంభణ సమయంలో వాస్తవ సమాచారాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చైనా దాచిపెట్టిందన్నారు. ఈ చర్యతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఓబ్రియన్‌ దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే, వరుసగా అమెరికా చేస్తున్న ఆరోపణలను తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఖండించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో 1986లో జరిగిన ఘటన మానవ చరిత్రలో ఒక అత్యంత దుర్ఘటనగా నిలిచిపోయింది. నిర్వహణ వైఫల్యంతో అణువిద్యుత్‌ కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నుంచి వెలుబడుతున్న అణుధార్మికతతో కనీసం లక్షల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు. కానీ దీనిపై ఎలాంటి రికార్డులు లేవు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.