Devotional

జూన్‌లో ఆలయాల్లోకి అనుమతి

Devotees to be allowed into temples starting June

భక్తులకు శుభవార్త. నాలుగో దశ లాక్‌డౌన్‌ పూర్తి కానున్న దృష్ట్యా జూన్‌లో ఆలయాల్లో భక్తుల ప్రవేశానికి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయశాఖ అధికారులు దృష్టి సారించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. కరోనా ప్రభావంతో మార్చి 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయాల్లో అర్చకులు, సిబ్బంది రోజువారీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా భక్తుల్ని మాత్రం అనుమతించడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వచ్చే నెలలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించాలని దేవాదాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిలిపివేసి, కేవలం సర్వ దర్శనానికే అనుమతించనున్నట్లు తెలిసింది. ప్రత్యేక పూజలకు అనుమతి ఇస్తే అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువ సమయం ఒకే చోట ఉంటారని, భౌతిక దూరం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు గ్రామీణ ప్రాంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ ఆలయంలో కోడె మొక్కు అతి ముఖ్యమైంది. ఒక్కో కోడె వెంట 10-20 మంది భక్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో కోడె మొక్కులను కొంత కాలం నిలిపివేయాలా? లేదా పరిమిత సంఖ్య నిబంధన విధించాలా?అని అధికారులు యోచిస్తున్నారు. అలాగే, కొన్ని రోజుల వరకు భక్తులకు గదులను అద్దెకు ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ టన్నెల్‌ ద్వారా లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. దర్శనం క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రధాన ఆలయాల్లో దర్శనానికి టైం స్లాట్‌ కేటాయించాలని భావిస్తున్నా.. సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అంశాలను పరిశీలించి.. మార్గదర్శకాలు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
**ప్రముఖ ఆలయాలు.. ఇదీ పరిస్థితి
రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రికి సగటున రోజూ 40వేల మంది వస్తారు. లాక్‌డౌన్‌కు ముందు ప్రత్యేక పూజలు, హుండీల్లో కానుకల ద్వారా ప్రతి నెలా రూ.8-10కోట్ల ఆదాయం సమకూరేది. పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న గదులను కూల్చివేశారు. కొండ కింద కొన్ని వసతి సత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వేములవాడ రాజన్న ఆలయానికి సాధారణ రోజుల్లో 5 వేల మంది, ఆది, సోమ వారాల్లో 20 వేల మంది భక్తులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 500 గదులు అందుబాటులో ఉండగా, నెలకు రూ.5-8కోట్ల ఆదాయం వచ్చేది. భద్రాద్రి దేవస్థానానికి రోజూ 15,000 మంది భక్తులు వస్తుంటారు. దేవస్థానం పరిధిలో 27 కాటేజీలు, 140 సత్రాల గదులు ఉన్నాయి. నెలకు రూ.2.5 కోట్ల ఆదాయం సమకూరేది. నిర్మల్‌ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి రోజూ 30వేల మంది భక్తులు వస్తుంటారు. దేవస్థానం పరిధిలో 100 వసతి గృహాలు ఉన్నాయి. ప్రతి నెలా రూ.2కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. 2 నెలల నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో దేవాదాయ శాఖ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు దేవుడిని దర్శించుకోలేకపోతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో వారంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.